ఆర్టిజన్ కార్మికులపై కేసు
– ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమానికి చర్య
– వెల్లడించిన తాండూరు సీఐ రాజేందర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: డిమాండ్ల సాధన కోసం సమ్మెకు దిగిన ఆర్టిజన్ కార్మికులకు చుక్కెదురు అయ్యింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమానికి దిగిన ఆరుగురు కార్మికులపై తాండూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు కేసు విషయాన్ని తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. మంగళవారం ఉదయం నుంచి విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులు సమ్మెకు దిగారు. అయితే రోడ్లపైకి వచ్చి.. ఎక్కువగా గుమిగూడి నిరసన చేపట్టరాదని పోలీసులు ముందే హెచ్చరించారు. ఇందుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలకు పాల్పడిన కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు.
ఈ నిరసనలో పాల్గొన్న ఆర్టిజన్ కార్మికులు నర్సింలు(తాండూరు మండలం), ఎండి జాఫర్(తాండూరు పట్టణం), యాదయ్య(యలాల), ఎండి జమీల్(తాండూరు పట్టణం), ఎస్. క్రిష్ణయ్య(యాలాల), మల్లయ్య(తాండూరు పట్టణం)లపై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు, ఆందోళనలు చేపడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

