సీఎం కేసీఆర్ మే డే కానుక
– కార్మికులకు నెలకు రూ. వెయ్యి వేతనం పెంపు
– మరిన్ని సౌకర్యాలను ప్రకటించిన సీఎం కేసీఆర్
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలోని కార్మికులకు సీఎం కేసీఆర్ కానుక అందజేశారు. రాష్ట్రంలో ఉన్న కార్మికులకు నెలకు రూ. 1వెయ్యి చొప్పున వేతనం పెంచుతున్నట్లు ప్రకటించారు. సోమవారం తెలంగాణ సచివాలయంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ కష్టజీవులకు, కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. తర తరాలుగా కష్టజీవి శ్రమతోనే ఈ ప్రపంచంలో సంపద సృష్టి జరుగుతున్నదని, మహోన్నతమైన విశ్వమానవ సౌధానికి శ్రమజీవుల త్యాగాలే పునాదిరాళ్లని సీఎం తెలిపారు. కార్మిక కర్షక సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నదని సీఎం వివరించారు. కార్మికులకు ప్రమాదం కారణంగా మరణం సంభవిస్తే రూ. 6 లక్షలను సంబంధిత కుటుంబానికి చెల్లించడం జరుగుతున్నదన్నారు. 2014 నుండి 2023 వరకు ఇలా మరణించిన కార్మికులకు సంబంధించిన 4,001 బాధిత కుటుంబాలకు రూ. 223 కోట్లను చెల్లించడం జరిగిందని సీఎం తెలిపారు.
ప్రమాదం కారణంగా వైకల్యానికి గురైతే రూ. 5 లక్షల చొప్పున, వైకల్యానికి గురైన 504 మంది కార్మికులకు రూ. 8.9 కోట్లను నేటివరకు చెల్లించడం జరిగిందని సీఎం తెలిపారు. కార్మిక కుటుంబంలోని ఇద్దరు మహిళా కార్మికులు, వారి ఇద్దరు పిల్లల పెండ్లికి ఒక్కరికి రూ. 30,000ల చొప్పున ‘వివాహ బహుమతి’ని రాష్ట్ర ప్రభుత్వం అందచేస్తున్నదని సీఎం అన్నారు. 2014 నుండి 2023 వరకు 46,638 మంది లబ్దిదారులకు రూ. 130 కోట్లు చెల్లించడం జరిగిందన్నారు. మహిళా కార్మికులకు రెండు కాన్పుల వరకు కాన్పుకు రూ. 30,000 చొప్పున ప్రసూతి ప్రయోజనాలను అందించడం జరుగుతున్నదన్నారు. 2014 నుండి నేటి వరకు 1,01,983 మంది లబ్ధిదారులకు రూ. 280 కోట్లను చెల్లించడం జరిగిందని సీఎం తెలిపారు. కార్మికులు ఏకారణం చేతనైనా మరణిస్తే రూ.1 లక్ష మొత్తాన్ని కార్మికుల కుటుంబాలకు చెల్లిస్తున్నారని, 2014 నుండి 2023 వరకు మరణించిన 35,796 మంది కార్మికులకు రూ. 288 కోట్లను చెల్లించడం జరిగిందని సీఎం తెలిపారు. కార్మికులపై ఆధారపడిన 1,49,536 మంది లబ్ధిదారులకు రూ. 94 కోట్లను చెల్లించడం జరిగిందని సీఎం తెలిపారు.
మరణానంతరం నిర్వహించే అంతిమయాత్ర కార్యక్రమాల కోసం 39,797 మందికి రూ. 98 కోట్లను నేటివరకు చెల్లించడం జరిగిందని సీఎం తెలిపారు. కోవిడ్ 19 మహమ్మారి విజృంభించిన కాలంలో రూ. 1,005 కోట్లను పలు కార్యక్రమాల కింద రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న కార్మిక సంక్షేమ ప్రగతి నమూనాను ఇదే స్ఫూర్తితో దేశవ్యాప్తంగా కార్మిక సంక్షేమానికి, వారి గుణాత్మక జీవన అభివృద్ధి కోసం తమ కృషి కొనసాగుతుందని సీఎం స్పష్టం చేశారు.

