సొంత పార్టీ అభివృద్ధిపై విమర్శలా..!

తాండూరు రాజకీయం వికారాబాద్

సొంత పార్టీ అభివృద్ధిపై విమర్శలా..!
– మహేంద్రుడు సాధించిన ప్రగతికే రిబ్బన్ కటింగులు
– పరోక్షంగానైనా విమర్శిస్తే ఊరుకునేది లేదు
– 40 ఏండ్ల పాట ప్రజలకు బోరు కొట్టేస్తోంది
– ఎమ్మెల్యే తీరును ఖండించిన ఎమ్మెల్సీ వర్గం
తాండూరు, దర్శిని ప్రతినిధి : సొంత పార్టీ నాయకుడు చేసిన అభివృద్ధిపై ఎమ్మెల్యే నోరుజారి విమర్శలు చేయడం ఏం పద్దతి అని తాండూరు బీఆర్ఎస్ పార్టీ, ఎమ్మెల్సీ మహేందర్ వర్గం నేతలు మండిపడ్డారు. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిపై ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పరోక్షంగా విమర్శలు చేసిన వైఖరిని ఖండించారు. గురువారం తాండూరు పట్టణంలోని ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి వివాసంలో మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, బీఆర్ఎస్ పట్టణ మాజీ అధ్యక్షులు అబ్దుల్ రవూఫ్, డీసీసీబీ జిల్లా డైరెక్టర్ రవీందర్ గౌడ్, బషీరాబాద్ జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు. కౌన్సిలర్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి తదితరులు మీడియాతో మాట్లాడారు.

ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె పల్లెకు పైలెట్, గల్లీ గల్లీకి పైలెట్ కార్యక్రమాల్లో ఆయన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిపై పరోక్షంగా చేసిన రాష్ట్రంలో రవాణా శాఖ మంత్రిగా వాఖ్యలను ఖండించారు. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి హాయాంలోనే తాండూరు నియోజకవర్గ అభివృద్ధి జరిగిందన్నారు. తెలంగాణ మహేందర్ రెడ్డి రూ.1800 కోట్లను సాధించుకవచ్చారని అన్నారు. ఆ నిధులతోనే తాండూరుకు బైపాస్ రోడ్డు, క్యాంపు కార్యాలయం, కొత్త మున్సిపల్ కార్యాలయం, మిషన్ భగీరత ట్యాంకులు, కాగ్నానదిలో చెక్ డ్యాం, కాగ్నా బ్రిడ్జి, మైనార్టీలకు గురుకుల పాఠశాలలు, అన్ని వర్గాలకు గురుకుల పాఠశాలలు, బషీరాబాద్ మండలంకు రోడ్డు, కరణ్ కోట్ కు, తట్టేపల్లికి రోడ్డు సాధించిన ఘనత మహేందర్ రెడ్డికే దక్కిందన్నారు. మంత్రి కేటీఆర్ తాండూరు మున్సిపల్ కు ప్రకటించిన రూ. 50 కోట్లతో పట్టణంలో రోడ్ల విస్తరణ జరిగిందన్నారు. మహేందర్ రెడ్డి సాధించిన నిధులతో చేపట్టిన ప్రగతి పనులకే రిబ్బన్ కట్ చేసి పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. గతంలో తాండూరుకు జిల్లా ఆసుపత్రిని సాధించిన ఘనత మహేందర్ రెడ్డిదే అన్నారు. హైదరాబాద్ రోడ్డు మార్గంకు మహేందర్ రెడ్డి హాయాంలోనే డబుల్ రోడ్డు మంజూరయ్యిందని గుర్తుచేశారు. మూడోసారి హాట్రిక్ చైర్ పర్సన్ గా కొనసాగుతున్న జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పట్నం సునితా మహేందర్ రెడ్డి కృషి చేశారన్నారు.

మీరు సాధించిన ప్రగతి ఏంది..?

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాతనే తాండూరుకు ప్రభుత్వం నిధులు కేటాయించిందని తెలిపారు. మంత్రిగా మహేందర్ రెడ్డి సాధించిన నిధులతో అభివృద్ధి జరగలేదా.. కళ్లు మూసుకున్నారా..? అని ప్రశ్నించారు. మహేందర్ రెడ్డి సాధించిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్దంగా ఉన్నామని, మీరు చేసిన అభివృద్ధి ఏందో చూపించాలన్నారు. మహబూబ్ నగర్ ఎంపీ శ్రీనివాస్ రెడ్డి, చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డిల సహాకారంతో జాతీయ రహదారి మంజూరయ్యిందన్నారు. ఎమ్మెల్యేగా తాండూరుకు రోహిత్ రెడ్డి సాధించిన రూ. 134 కోట్లను స్వాగతిస్తున్నామని, ఆ నిధులతో తాండూరును అభివృద్ధి చేయడాన్ని మద్దతిస్తామన్నారు.

ఎమ్మెల్సీ వర్గానికి ఆహ్వానమే లేదు.

ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె పల్లెకు పైలెట్ గల్లీ గల్లీకి పైలెట్ కార్యక్రమాలకు ఎమ్మెల్సీ వర్గానికి ఎలాంటి ఆహ్వానం అందించకుండానే నిర్వహించుకున్నారని అన్నారు. ఈ పద్ధతి దేనికి సంకేతమని ప్రశ్నించారు. తనకు అనుకూలమైన వారికే ప్రభుత్వ పథకాలు అమలు చేసుకున్నారని, అభివృద్ధి పనులు మంజూరు చేయించారని ఆరోపించారు.

40 ఏండ్ల అభివృద్ధి పాట బోరు

మాట్లాడితే సమావేశాల్లో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పాడుతున్న 40 ఏండ్లలో జరగని అభివృద్ధి చేశానని చెప్పుకుంటున్న పాట ప్రజలకు యమ బోరు కొడుతోందని విమర్శించారు. గత ఐదేళ్లు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉన్న విషయాన్ని మరిచి పోయారా.. అని ప్రశ్నించారు. మహేందర్ రెడ్డి హాయాంలో సీఎం కేసీఆర్ తాండూరుకు ఎలాంటి నిధులు ఇవ్వలేదా..? ఎలాంటి అభివృద్ధి జరగలేదా అని ప్రశ్నించారు. మహేందర్ రెడ్డిపై పరోక్షంగా పొట్టోడు.. బుడ్డాడు అని సంభోదిస్తూ విమర్శలు చేయడం పద్దతి కాదన్నారు. మహేందర్ రెడ్డి గట్టోడు.. మొగోడు.. అని అభివర్ణించారు. మళ్లీ ఎన్నికల్లో ఆయనకే ఎమ్మెల్యే టిక్కెట్టు వస్తుందని బలంగా ఆశిస్తున్నామన్నారు. అలా కాకుండా ఎమ్మెల్యే టిక్కెట్టు ఎవ్వరికి వచ్చినా పనిచేస్తామని పేర్కొన్నారు. ఇలా రెచ్చగొట్టే రాజకీయాలను మానుకోవాలని సూచించారు. నోరు జారితే ఊరుకునేది లేదని, మేం కూడా అదే భాషలో ఎదుర్కొనేందుకు సిద్ధమని సవాల్ చేశారు.

మూడేళ్ల శ్రద్ధ ఎక్కడికి పోయింది

తాండూరు మున్సిపల్ పై ఎమ్మెల్యేకు శ్రద్ధ ఇప్పుడు పుట్టుకొచ్చిందా అని మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ ప్రశ్నించారు. గత మూడేళ్లలో మున్సిపల్ లో కమీషనర్ లేకుండా చేసి అభివృద్ధిని అడ్డుకున్నారని అన్నారు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్న మహేందర్ రెడ్డి ఎలాంటి నీచరాజకీయాలు చేయకుండా అభివృద్ధి చేశారని అన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే మున్సిపల్‌ను అదుపులో ఉంచుకున్నారని ఆరోపించారు. అవన్నీ మానుకుని పార్టీ బలోపేతానికి పాటుపడాలని, అభివృద్ధికి కృషి చేయాలని.. అన్నారు. ఇలాంటి రెచ్చగొట్టే రాజకీయాలు మాని అభివృద్ధిని చేసి చూపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు సాయిపూర్ బాల్ రెడ్డి, మసూద్, బంటు మల్లప్ప, సంజీవరావు, ఇందూరు ప్రకాష్, అజయ్ ప్రసాద్, కౌన్సిలర్లు ప్రవీణ్ గౌడ్, బోయరవి, బిర్కణ్ రఘు, అశోక్, బీదర్ రాజశేఖర్, తాండూరు, పెద్దేముల్, బష్ రాబాద్, యాలాల మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.