ఆసక్తి రేపుతున్న ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే సంయుక్త సమావేశం
– రేపటి మీటింగ్‌లో కీలక నిర్ణయాలంటూ ప్రచారం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వర్గీయుల మద్య విభేధాలకు తెరపడినట్లు తెలుస్తోంది. గత కొన్నిరోజులుగా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే వర్గంలో టీఆర్ఎస్ గ్రామ కమిటిల ఎన్నికలపై విమర్శల యుద్దం కొనసాగుతోంది. అధిష్టానం వరకు వెళ్లిన ఈ వ్యవహారంపై సోమవారం మంత్రి కేటీఆర్ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిలతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ భేటీ అనంతరం ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు సంయుక్తంగా ఓ సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రేపు తాండూరు పట్టణంలోని దుర్గా గ్రాంన్డియర్‌లో తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారి అధ్యక్షతన ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డిలు సంయుక్తంగా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ సమావేశంపై ఇరువర్గాల నాయకులు, కార్యకర్తల్లో ఆసక్తిని పెంచడంతో పాటు ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. రేపటి సమావేశంలో నియోజకవర్గాలపై పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు ప్రచారం సాగుతోంది. మరోవైపు రేపు దుర్గా గ్రాండ్యూర్‌లో ఏర్పాటు చేసిన సమావేశానికి ఎంపీ, టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రాములు, చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి, పార్టీ తాండూరు నియోజకవర్గం ఇన్చార్జి జహాంగీర్ పాషలు పాల్గొంటున్నారు.

