దమ్ముంటే కుట్రను నిరూపించండి
– బీజేపీపై బురద జల్లితే సహించేదిలేదు
– మునుగోడుకు భయపడే చిల్లర రాజకీయాలు
– బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి యు. రమేష్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు దమ్ముంటే ఎమ్మెల్యేల కొనుగోలు కుట్రను నిరూపించాలని బీజేపీ వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి యు. రమేష్ కుమార్ సవాల్ చేశారు. మునుగోడు ఉప ఎన్నిలకు భయపడి టీఆర్ఎస్ పార్టీ హైడ్రామా చేస్తుందని విమర్శించారు. గురువారం బీజేపీ వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి యు. రమేష్ కుమార్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసి టీఆర్ఎస్కు, తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యు. రమేష్ కుమార్ మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నికలకు టీఆర్ఎస్ భయపడి చిల్లర రాజకీయాలు చేస్తోందన్నారు. బీజేపీపై బురద జల్లేందుకు ప్రగతి భవన్ నుంచే ప్లాన్ వేశారని అన్నారు. కావాలనే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహరంపై హైడ్రామా చేశారని ఆరోపణలను తిప్పికొట్టారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనాల్సిన అవసరం బీజేపీకి లేదని అన్నారు. బీజేపిపై బురద జల్లితే సహించేది లేదని… తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఖబడ్డార్ అంటూ మండిపడ్డారు. పలు విషయాల్లో వివాదాస్పదంగా ఉన్న ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సీఎం కేసీఆర్ మెప్పు కోసం ప్రయాస పడుతున్నారని విమర్శించారు. తాండూర్ముపై చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేయాలని, ఇలాంటి దిగజారుడు రాజకీయాలను మానుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, ఫ్లోర్ లీడర్ అంతారం లలిత, కౌన్సిలర్ సాహు శ్రీలత, లావణ్య, బీజేపీ జిల్లా కార్యదర్శి బంటారం భద్రేశ్వర్, ఉపాధ్యక్షులు హన్మంతు ముదిరాజ్. నాయకులు పూజారి పాండు తదితరులు పాల్గొన్నారు.

