అసూయతో శిరీష హత్య..!

క్రైం తెలంగాణ రంగారెడ్డి వికారాబాద్

అసూయతో శిరీష హత్య..!
– వేరే అబ్బాయితో మాట్లాడుతోందని ఘోరం
– అమ్మాయి బావే హంతకుడు
– కేసు మిస్టరీని చేధించిన పోలీసులు
– వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఐపీఎస్
వికారాబాద్, దర్శిని ప్రతినిధి: తనతో మాట్లాడడం లేదని మరదలిపై అసూయ పెంచకున్న బావ ఆమెను కిరాతకంగా హత్య చేశాడు. వేరే అబ్బాయితో మాట్లాడుతోందని అనుమానం పెంచుకుని ఘాతుకానికి పాల్పడ్డాడు. అతనిపైనే అనుమానం కలిగిన పోలీసులు అదుపులోకి తీసుకుని కటకటాలకు పంపారు. వికారాబాద్‌ జిల్లాలోని పరిగి మండలంలో కలకలరం రేపిన శిరీష హత్య కేసు మిస్టరీ వీడింది. బుధవారం వికారాబాద్‌ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ఐపీఎస్ కేసు వివరాలను వెల్లడించారు. ఈనెల 11న పరిగి మండలం కాళ్లపూర్ గ్రామానికి చెందిన జుట్టు శిరీష(18) గ్రామ సమీపంలోని నీటికుంటలో హత్యకు గురైన సంఘటన వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. గ్రామానికి చెందిన జంగయ్యకు పెద్ద కూతురు లలిత, కుమారుడు శ్రీనివాస్, చిన్న కూతురు శిరీషలు ఉన్నారు. లలితకు పరిగి మండలం బాహార్‌ పేట్‌కు చెందిన ఎర్రగడ్డపల్లి అనిల్‌(25)తో వివాహాము జరిగింది. శిరీష వికారాబాద్‌లో నర్సుగా పనిచేసేది. అప్పటికే అనిల్‌ మరదలు శిరీషను శారీరకంగా అనుభవించాలని కన్నెశాడు.

పది రోజుల క్రితం జంగయ్య భార్యకు అనారోగ్యం రావడంతో ఆమెను హైదరాబాద్‌లో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటి నుంచి అన్న శ్రీనివాస్ హైదరాబాద్‌లోనే ఉండడంతో శీరీష గ్రామానికి వచ్చింది. అయితే ఈనెల 10న శిరీష ఇంట్లో వంట చేయడం లేదని శ్రీనివాస్ పరిగి మండలం బాహార్ పేట్‌లో ఉంటున్న తన అక్క లలితకు ఫోన్‌ చేసి చెప్పాడు. ఇదే విషయం లలిత ద్వారా అనిల్ తెలుసుకున్నాడు. గత ఆరు నెలలుగా శిరీష తనతో మాట్లాడకుండా వేరే అబ్బాయితో మాట్లాడుతోందని అనుమానం పెంచుకున్న అనిల్.. తాజాగా శిరీష వ్యవహారంపై తండ్రి జంగయ్య, అన్న శ్రీనివాస్‌లకు ఫోన్‌ చేసి ఆమె గురించి తిట్టేశాడు. దీంతో తండ్రితో పాటు అన్న శ్రీనివాస్ శిరీషను ఫోన్‌ చేసి తిట్టారు. తండ్రి, అన్న తిట్టడానికి బావే కారణమని తెలుసుకున్న శిరీష అతనికి ఫోన్‌ చేసి తిట్టింది. దీంతో అదేరోజు బావ అనిల్ బైక్ పై కాళ్ళాపూర్ వెళ్లి శిరీషను కొట్టేశాడు. తండ్రి కూడా కొట్టడంతో మనస్థాపం చెందిన శిరీష ఇంట్లోకి వెళ్లి ఉరేసుకునేందుకు యత్నించింది. గమనించిన తండ్రి, బావలు దాని నుంచి తప్పించారు. తరువాత అనిత్ పరిగి వెళ్లిపోయాడు. రాత్రి సమయంలో శిరీష ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఇంటికి బయట నుంచి గొల్లెం పెట్టేసి వెళ్లిపోయింది. ఈ విషయం అనిల్ తన భార్య లలిత ద్వారా తెలుసుకున్నాడు.

వెంటనే భార్యతో పాటు అనిల్‌ కాళ్ళాపూర్‌ బైకుపై చేరుకున్నాడు. భార్యను ఇంట్లో దించి శిరీషను వెతికే ప్రయత్నం చేశాడు. కాళ్ళాపూర్ మార్గంలో వెళుతుండగా శిరీషను గమనించిన అనిల్ ఇన్నాళ్లు తనతో మాట్లాడడం లేదని, వేరే అబ్బాయితో మాట్లాడుతుందనే విషయంలో గొడవ పడ్డారు. దీంతో ఒంటరిగా ఉన్న శిరీషను అక్కడే ఉన్న కర్రతో దాడి చేశాడు. అనంతరం నీటి కుంట వద్దకు తీసుకెళ్లి అక్కడ పగిలి ఉన్న ఖాళీ బీరు సీసాతో శిరీష కళ్లలో పొడిచాడు. సీసాను చెరువులో పడేసి.. శిరీషను కూడా చెరువులోకి తీసుకెళ్లి ముంచి చంపేశాడు. చనిపోయిందని నిర్దారించుకున్న తరువాత అక్కడి నుంచి ఒక్కడే పరిగికి వెళ్లిపోయాడు. మరుసటి రోజు శిరీష హత్య కలకలం రేపింది. విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ జరపగా బావ అనిల్‌పై అనుమానం ఏర్పడింది. నిందితున్ని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో నిందితుడు అనిల్ నేరాన్ని అంగీకరించినట్లు జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి వెల్లడించారు. నిందితుడి వద్ద నుంచి ఫోన్, బైకు స్వాదీనం చేసుకుని రిమాండుకు తరలించినట్లు తెలిపారు. నిందితుడు అనిల్‌పై గతంలో కూడా ఓ కేసులో రిమాండుకు వెళ్లినట్లు ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు.

ఇది కూడా చదవండి…

పైలెట్ బర్త్ డే అదుర్స్‌..!

chaithany collage