ప్రతిపక్షాలది కడుపు మంటే..!
– తెలంగాణ సంక్షేమాన్ని ఓర్వలేక పోతున్నాయి
– సీఎం కేసీఆర్ సర్కారుపై దుష్ప్రచారం
– రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్
– తాండూరులో అట్టహాసంగా సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ
తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ సంక్షేమ పాలనకు ప్రతిపక్షాలు కడుపుమంటతో ఉన్నాయని, అడ్డుకునేందుకు దుష్ప్రచారం చేస్తూ ప్రమాదకరంగా మారుతున్నాయని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుంటే ఓర్వలేక కడుపు మంటతో విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. గురువారం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో నిర్వహించిన గౌడ సోదరుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ తాండూరు ఎమ్మెల్యే పై ఎలెట్ రోహిత్ రెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇందులో భాగంగా సర్దార్ పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలలో భాగంగా పట్టణంలోని వినాయక్ చౌక్ పోట్లీ మహరాజ్ దేవాలయం ముందు ఏర్పాటు చేసిన సర్వాయి సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు.
అనంతరం ఏర్పాటు చేసిన ఆత్మీయ స మ్మేళనంలో ఆయన ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అన్ని వర్గాలకు, కులవృత్తుల సంక్షేమానికి, అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. రైతు బంధు, రైతుబీమా. బీసీ బందు, ఆసరా వంటి పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. తెలంగాణలో గౌడస్తుల కోసం కూడా సీఎం కేసీఆర్ సర్కారు కృషి చేస్తుందన్నారు. అన్ని వర్గాలతో పాటు గౌడ్లు అందరు బలపడుతున్నారని అన్నారు. సంక్షేమం, అభివృద్దిలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. రైతులకు, ప్రజలకు చేస్తున్న సంక్షేమాన్ని ఓర్వలేక కొన్ని పార్టీల నేతలు తెలంగాణపై దుష్ప్రచారానికి తెరలేపుతున్నారని అన్నారు. తెలంగాణ కోసం ఏనాడు పనిచేయని నేతలు, పార్టీలు పట్టించుకోకుండా ఓర్వలేక పోతున్నారని అన్నారు. రైతులకు మూడు గంటల విద్యుత్ చాలు అని వాఖ్యలు చేసిన నేతపై, కులాలు, మతాల పేరుతో రాజకీయాలు చేస్తున్న వారి నుంచి రాష్ట్రానికి ప్రమాదం అన్నారు. కడుపు మంటతో మాయమాటలను చెప్పే వారిని నమ్మరాదని సూచించారు. పాలమూరు రంగారెడ్డికి ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రభుత్వం పోరాడి అనుమతులు సాధించిందన్నారు. త్వరలోనే తాండూరు నియోజకవర్గానికి సాగునీరు అందించి తీరుతామన్నారు. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీకి పనిచేసిన గుణవంతులకు సీఎం కేసీఆర్ సముచిత స్థానం కల్పిస్తారని అన్నారు. అలాంటి వారందరికి తోడ్పాటు అందిస్తారని అన్నారు. మరోవైపు అన్ని వర్గాల కోసం పోరాడిన సర్వాయి పాపన్న గౌడ్ అందరికి ఆదర్శప్రాయుడు అయ్యారని, కొందరి వల్ల ఆయన చరిత్రను తప్పుగా ప్రచారం చేశారని అన్నారు. చత్రపతి శివాజీ మహరాజ్ కు సమకాలికుడుగా నిలచిన సర్వాయి పాపన్న గౌడ్ గురించి అందరు తెలుసుకోవాలన్నారు. ఆదేవిధంగా తాండూరు ఎమ్మెల్యే’ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ తాండూరులో ఎక్సైజ్ పోలీసు శాఖ స్టేషన్ ను ఏర్పాటు చేయాలని, కోట్ పల్లి ప్రాజెక్టును టూరిస్ట్ స్పాట్ గా తీర్చిదిద్దేందుకు చొరవ చూపాలని కోరారు.
అంతేకాకుండా క్రీడా ప్రాంగణం కోసం స్టేడియం ఏర్పాటుకు నిధులు మంజూరు చేయాలని కోరారు. ఇందుకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ నెలరోజుల్లో వాటి కార్యాచరణకు ప్రణాళికలు రూపొందిస్తామని వాటిని నెరవేర్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం తాండూరు గౌడ సంఘం సోదరులు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను గజమాలతో సన్మానించారు. అంతకుముందు గౌడ సంఘం ఆధ్వర్యంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిలకు ర్యాలీతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, గౌడ్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పల్లె లక్ష్మణ్ గౌడ్, ఈత పరిశ్రమ శాఖ చైర్మన్ పల్లె రవి కుమార్, టీఎస్ డబ్ల్యూఐడీసీ మాజీ చైర్మన్ నాగేందర్ గౌడ్, చక్రవర్తి గౌడ్, ప్రశాంత్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా సర్సింలు, సీనియర్ నాయకులు శ్రీశైల్ రెడ్డి, కౌన్సిలర్లు సిందూజ గౌడ్, ప్రభాకర్ గౌడ్, లత గౌడ్, విజయాదేవి, గౌడ సంఘం నాయకులు విశ్వనాథ్ గౌడ్, నరేందర్ గౌడ్, హరిహరగౌడ్, సంతోష్ గౌడ్, ఆర్సీ గౌడ్, వివిద పార్టీల గౌడ నాయకులు, సోదరులు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…

