మద్యం టెండర్లకు పోటాపోటీ..!

తాండూరు తెలంగాణ రాజకీయం వికారాబాద్

మద్యం టెండర్లకు పోటాపోటీ..!
– వికారాబాద్‌ జిల్లాలో దండిగా దరఖాస్తులు
– 59 దుకాణాల నుంచి రూ. 47 కోట్ల ఆధాయం
– 2535 దరఖాస్తుల్లో లక్కు ఎవరికి దక్కేనో..?
– ఏయే మండలం నుంచి ఎన్ని దరఖాస్తులు అందాయంటే..?
వికారాబాద్‌, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకవస్తున్న కొత్త మద్యం పాలసీ ప్రభుత్వ ఖజానాకు భారీ ఆధాయం తెచ్చిపెట్టింది. వికారాబాద్‌ జిల్లా నుంచి మద్యం దుకాణాలకు దండిగా దరఖాస్తులు వచ్చాయి. ఆశావాహులు పోటీ పడి మరీ దరఖాస్తులను సమర్పించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,620 మద్యం దుకాణాల కోసం ఈ నెల 4వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలైన సంగతి తెలిసిందే. దీంతో డ్రాలో పాల్గొనే వారు రూ.2 లక్షలు తిరిగి ఇవ్వని నగదు చలాన్‌ (డీడీ)తో దరఖాస్తు సమర్పించారు. ఇందులో భాగంగా వికారాబాద్‌ జిల్లాలో 59 దుకాణాలకు రిజర్వేషన్లను కూడా ఖరారు చేసి దరఖాస్తులను స్వీకరించారు. శుక్రవారంతో మద్యం దుకాణాల టెండర్ల దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసింది. వికారాబాద్‌ జిల్లాలోని తాండూరుకు 18 మద్యం దుకాణాలు, వికారాబాద్‌కు 15 దుకాణాలు, మోమిన్ పేట్‌కు 6 దుకాణాలు, పరిగికి 12 దుకాణాలు, కోడంగల్‌కు 8 దుకాణాలను ఎస్సీ, ఎస్టీ, జనరల్ రిజర్వేషన్ల కింద దరఖాస్తులను స్వీకరించారు. తాండూరు నుంచి 552, వికారాబాద్‌ నుంచి 832, మోమిన్ పేట్ నుంచి 334, పరిగి నుంచి 555, కోడంగల్ నుంచి 262 మొత్తం 2535 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. మొత్తం దరఖాస్తుల నుంచి ఫీజు రూపంలో ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.47 కోట్లు వచ్చినట్లు వెల్లడించారు. స్వీకరించిన దరఖాస్తులలో ఈ నెల 20న డ్రా ద్వారా దుకాణాలను కేటాయించనున్నారు. డ్రా ద్వారా గౌడ్‌లకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మిగిలిన కేటగిరిల వారిగా దుకాణాలు కేటాయించనున్నారు. ఈ ఎంపిక ప్రక్రియ జిల్లా కలెక్టర్‌ సమక్షంలో పూర్తి కానుంది. డిసెంబర్‌ 1 నుంచి అమల్లోకి రానున్న నూతన మద్యం విధానంలో భాగంగా ఈ కొత్త దుకాణాలు ఏర్పాటు కానున్నాయి.

ఇది కూడా చదవండి…

పాన్‌తో ఆధార్‌ లింకు చేయకుంటే అంతే..!