బీసీలను మోసం చేసేందుకు కుట్ర

తాండూరు రాజకీయం వికారాబాద్

బీసీలను మోసం చేసేందుకు కుట్ర
– విగ్రహావిష్కరణలో మోసపూరిత రాజకీయం
– బీఎస్పీ తాండూరు అసెంబ్లీ ఇంచార్జ్ సత్యమూర్తి దొరశెట్టి
తాండూరు, దర్శిని ప్రతినిధి: బీసీలను మోసం చేసేందుకు అగ్నవర్ణ నాయకులు కుట్ర చేస్తున్నారని బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) తాండూరు అసెంబ్లీ ఇంచార్జ్ సత్యమూర్తి దొరశెట్టి విమర్శించారు. శనివారం తాండూరు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తాండూరులో బీసీలను విచ్చిన్నం చేసేందుకు రాజకీయాలు జరుగుతున్నాయన్నారు. స్థానిక ఎమ్మెల్యే బీసీలను మోసం చేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. గత యేడాది తాండూరు పట్టణంలో సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణకు చర్యలు చేపడితే దిమ్మెను కూల్చివేసి అడ్డంకులు ఏర్పడిన విషయాన్ని గుర్తుచేశారు. అప్పుడు అడ్డంకులు వస్తే ఇప్పుడు ఘనంగా విగ్రహావిష్కరణ ఎలా సాధ్యమయ్యిందని ప్రశ్నించారు. ఇందులో కూడా ఓ బీసీ నేతకు ముందు నడిపించి విగ్రహావిష్కరణను ఏర్పాటు చేయించారని అన్నారు. తామూ సర్దార్ పాపన్న విగ్రహావిష్కరణకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.

జిల్లాలోని పరిసర నియోజకవర్గాలలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణలు జరగలేదని, కేవలం తాండూరులో ఆయన విగ్రహావిష్కరణ పేరుతో బీసీలను మభ్యపెట్టే ప్రయత్నం జరిగిందని విమర్శించారు. బీసీలు అందరు ఇట్టి విషయాలను గమనించి ఏకం కావాలన్నారు. వచ్చే ఎన్నికల్లో బీసీ నేతలను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. మరోవైపు బీఎస్పీ పార్టీ బీసీలతో పాటు అన్ని బహుజన వర్గాల కోసం కృషి చేస్తుందన్నారు. అసెంబ్లీ బరిలో బీఎస్పీ రాష్ట్రంలోని అన్ని స్థానాలతో పాటు తాండూరులో కూడ బరిలో ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ అసెంబ్లీ ఇంచార్జ్‌లు సోమశెట్టి జగదీశ్వర్, నవీన్ కుమార్ యాదవ్, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు అంజద్ అలీ, నాయకులు రవికుమార్, సల్మాన్, సత్య తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..

పాన్‌తో ఆధార్‌ లింకు చేయకుంటే అంతే..!