‘మోర్‘ దొంగల ముఠా అరెస్టు..!
– చోరీ కేసును చేధించిన పట్టణ పోలీసులు
– వివరాలు వెల్లడించిన డీఎస్పీ శేఖర్ గౌడ్
– పోలీసులకు ఎలా దొరికిపోయారంటే.. ?
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని మోర్ సూపర్ మార్కెట్‌లో జరిగిన చోరీ కేసును పోలీసులు చేధించారు. సీసీ పుటేజీలు, క్లూస్, టెక్నాలజీ ఆధారంగా దొంగలను గుర్తించి కటకటాల్లోకి పంపారు. శనివారం మీడియా సమావేశంలో తాండూరు డీఎస్పీ శేఖర్ గౌడ్ కేసు వివరాలను వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రం సేడం తాలుకా, కల్బుర్గి జిల్లా సీల్దార్ కోట్ గ్రామానికి చెందిన కొరుకు నవీన్ (22), కుర్వ శ్రీనివాస్(23), సుగ్గాళ సంజీవ (22), డబ్బా సంజీవ(23)లు ఊళ్లో కూలీ పనులు, కులవృత్తులు చేసుకుంటూనే గత కొన్నేళ్లుగా ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే నవీన్, శ్రీనివాస్, సంజీవులు ఈనెల 21న తాండూరు పట్టణంలోని మోర్ సూపర్ మార్కెట్ లో చోరీకి పాల్పడ్డారు. షెట్టర్ ను ధ్వసం చేసి దుకాణంలోని గోద్రేజ్ లాకర్ లో సుమారు రూ. 2లక్షలు, మరో రూ. 36 వేల నగదుతో పాటు సెల్ ఫోన్ ను దొంగిలించారు. మోర్ సూపర్ మార్కెట్ మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు తాండూరు. పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు విచారణ ముమ్మరం చేశారు. సీసీ ఫుటేజీలు, టెక్నాలజీ సహాకారంతో నిందితులను గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించారు.
ముదేళ్, కోడంగల్‌లో చోరీలు
మరోవైపు నిందితుల్లో నవీస్, శ్రీనివాస్, సంజీవ, డబ్బా సంజీవలు కర్ణాటకలోని ముదేళ్ల పోలీస్టేషన్ పరిధిలో 2 దొంగతనాలు, వికారాబాద్ జిల్లాలోని కోడంగల్ ప్రాంతాల్లో చోరీలకు 3 దొంగతనాలకు పాల్పడినట్లు కేసులు ఉన్నాయని డీఎస్పీ వివరించారు. కోడంగల్ పట్టణంలో మే 26, 27 తేదిలలో వరుస చోరీలు, గత నెల జూలై 7, 9వ తేదిలలో చోరీలకు పాల్పడి నగదుతో పాటు వెండి వస్తువులు, లాప్ టాప్, మోబైల్ ఫోన్లు చోరీ చేశారని వివరించారు. అయితే రాత్రిళ్లు మాత్రమే చోరీ చేసే ప్రాంతాన్ని ఎంచుకుంటారని, వెంట తెచ్చుకున్న గడ్డపారతో షెట్టర్లను ధ్వసం చేసి దొరికిన వాటికి ఎత్తుకెళ్లడమే వీళ్ల ప్రత్యేకత అని తెలిపారు. 6వ దొంగతనంగా తాండూరులో చోరీకి పాల్పడి పోలీసులకు చిక్కారని తెలిపారు.
డబ్బుల లాకర్, బైకుల స్వాదీనం
అయితే తాండూరు పట్టణంలోని మోర్ సూపర్ మార్కెట్ లో చోరీ చేసిన నగదులో వారి వద్ద నుంచి దాదాపు రూ. 1లక్ష 70 వేల నగదు, సెల్ ఫోన్, గోద్రేజ్ లాకర్ లను స్వాధీనం చేసుకున్నారు.

పాత కేసుల్లో కూడా బట్టలు, లాప్ టాప్, సెల్ ఫోన్లు, దొంగతనానికి వినియోగించిన రెండు బైకులను స్వాదీనం చేసుకున్నామని వెల్లడించారు. నిందితుల్లో నవీన్, శ్రీనివాస్, సుగ్గాల సంజీవలను మాత్రమే అరెస్టు చేశామని, మరో నిందితుదు డబ్బా సంజీవ పరారిలో ఉన్నారని తెలిపారు. అదేవిధంగా కేసు చేధింపులో తీవ్రంగా శ్రమించిన సీఐ రాజేందర్ రెడ్డి, ఎస్ఐ అబ్దుల్ రవూఫ్, పోలీసు సిబ్బంది అంజద్, శివ, షబ్బీల్, ఇతర టీం సభ్యులను డీఎస్పీ అభినందించారు. రివార్డులను కూడా అందిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సీఐ రాజేందర్ రెడ్డి, ఎస్ఐ అబ్దుల్ రవూఫ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…

