పిల్లలకు జన్మనిచ్చిన చిరుతపులి

తెలంగాణ హైదరాబాద్

పిల్లలకు జన్మనిచ్చిన చిరుతపులి
– జనం అలజడితో ఓ పిల్లను వదిలేసిన తల్లి
– వైరల్ కావడంతో సెల్పీలకు ఎగబడిన జనం
– ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే..?
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: అడవిలో రారాజుల తిరిగే పులి జన సంచారానికి దగ్గరగా పిల్లలకు జన్మనిచ్చింది. తన పిల్లలను తీసుకెళ్లే క్రమంలో జనం అలజడి రావడంతో ఓ పిల్లను తీసుకెళ్లి.. మరో పిల్లను అక్కడే వదిలేసి వెళ్లిపోయింది. ఈ సంఘటన స్థానికంగా వైరల్ కావడంతో జనం చిరుత పిల్లలతో సెల్పీల కోసం ఎగబడ్డారు. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల శివారు అటవీ ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. గత కొన్నిరోజులుగా ఈ ప్రాంతంలో చిరుత సంచారం కలకలం రేపింది. తాజాగా మండల కేంద్రం నుండి శివంగాలపల్లి గ్రామానికి వెళ్లే దారి పక్కన ఉన్న డంపింగ్ యార్డ్ సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో తెల్లవారు జామున చిరుతపులి రెండు పిల్లలకు జన్మనిచ్చింది. అందులో తల్లి చిరుత ఒక్క పిల్లను తీసుకుని వెళ్తుండగా అప్పుడే పొలం పనుల కోసం వెళ్లిన ఓ రైతు గమనించాడు.

వెంటనే విషయాన్ని గ్రామ సర్పంచ్‌కు తెలిపాడు. వదిలేసిన చిరుత పిల్లకోసం చిరుత తిరిగి వస్తుందని ఆ రైతు దూరంగా చెట్ల పొదల మాటున వేచి చూశారు. ఎంతకీ చిరుత రాకపోవడంతో పిల్ల చిరుతను జాగ్రత్తగా సంరక్షించాడు. అప్పటికే చలికి వణికిపోతున్న చిరుతపులి పిల్లను సంరక్షించి, దానికి పాలు తాగించి, అదే ప్రాంతంలో పిల్లను వదిలిపెట్టారు. జరిగిన విషయాన్ని అటవీ అధికారులకు వివరించాడు. అప్పటికే జనాలు చిరుత పిల్లను చూసేందుకు తరలివచ్చారు. చిరుత పిల్లతో సెల్పీలు తీసుకునేందుకు ఎగబడ్డారు. కొద్ది సేపటి తరువాత సమాచారం అందుకున్న సిరిసిల్ల రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ రావు, సెక్షన్ ఆఫీసర్ బాపురాజులు అక్కడికి వచ్చిన ప్రజలను పంపించారు. చిరుతపులి వెళ్లిన ప్రాంతానికి మండల ప్రజలు ఎవ్వరూ రాకుండా, సంచరించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. తల్లి చిరుతపులి వచ్చి ఉన్న పిల్లను తీసుకవెళ్లుతుందని రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ రావు తెలిపారు. చిరుత పులి వచ్చి పిల్లను తీసుకు వెళ్ళే వరకు ఇక్కడే పర్యవేక్షిస్తామని, చిరుత పులి వచ్చే దారిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి చూస్తామని పేర్కొన్నారు. పిల్ల చిరుత కోసం తల్లి చిరుత వచ్చే అవకాశం ఉండటంతో… ఆయా ప్రాంతాల.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ ప్రాంతంలో చిరుత పులి పిల్ల కనిపించిన వార్త జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంమైంది.

ఇదికూడా చదవండి…

14 మంది మట్కారాయూళ్లపై కేసు