ఆకర్షణ.. భేష్‌..!

కెరీర్ జాతీయం తెలంగాణ హైదరాబాద్

ఆకర్షణ.. భేష్‌..!
– చిన్నారిని అభినందించిన మోడి
– ఎందుకోసం అంటే…?
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: ఆకర్షణ సేవలు భేష్‌.. అంటూ భారత దేశ ప్రధాని మోడి ఓ 11 ఏండ్ల చిన్నారిని అభినందించారు. ఆమెను చూసి చాలా గర్విస్తున్నా అంటూ స్వయంగా ప్రకటించారు. ఇంతకు ఆ ఆకర్షణ ఎవరు.. ఆమె ఏం చేసిందంటే వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతి నెల ‘మన్ కీ బాత్’ రేడియో కార్యక్రమం ద్వారా అనేక విషయాలపై ప్రసంగిస్తుంటారు. ప్రతినెలా చివరి ఆదివారం ప్రధాని మోడీ ప్రసంగించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంటారు. అయితే, ‘మన్ కీ బాత్’ 105వ ఎపిసోడ్‌లో భాగంగా మాట్లాడిన ప్రధాని మోడీ.. హైదరాబాద్‌ సనత్‌నగర్‌కు చెందిన ఏడవ తరగతి విద్యార్థిని ఆకర్షణ సతీశ్‌‌‌పై ప్రశంసలు కురిపించారు.

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో చదువుతున్న 7వ తరగతి చదువుతున్న 11 ఏళ్ల విద్యార్థిని ఆకర్షణ సతీష్.. లైబ్రరీలను ఏర్పాటు చేయడం ద్వారా పిల్లలలో పుస్తక పఠన అలవాటును పెంపొందించేందుకు కృషి చేస్తోంది. మొదటగా అధికారుల అనుమతితో ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆసుపత్రిలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసింది. అంతేకాకుండా వివిధ ప్రాంతాల్లో పిల్లల కోసం మరో ఆరు లైబ్రరీలను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఆమె లైబ్రరీలలో 6,000 కంటే ఎక్కువ పుస్తకాలు ఉన్నాయి. పుస్తక పఠనంపై ఉన్న ఆసక్తితో ఇతరులను కూడా చదివించాలన్న ఆశయంతో తండ్రి డా. సతీశ్‌ కుమార్‌ ప్రోత్సాహంతో పుస్తకాలను సేకరించడం, లైబ్రరీలు ఏర్పాటు చేయడం అలవర్చుకుంది. వచ్చేవారం సిద్దిపేటలో ఎనిమిదో గ్రంథాలయాన్ని మంత్రి హరీశ్‌ ప్రారంభించబోతున్నారు. మన్‌కీ బాత్‌ ద్వారా విషయం తెలుసుకున్న ప్రధాని మోడి చిన్న వయసులోనే సమాజానికి తన వంతు కృషి చేస్తున్నందుకు ఆకర్షణ సతీష్‌ను అభినందించారు.అయితే ఆకర్షణ సతీష్‌ మాట్లాడుతూ అక్టోబరు 15న మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం జయంతి నాటికి పదోది ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలిపింది.

ఇదికూడా చదవండి…

14 మంది మట్కారాయూళ్లపై కేసు