హస్తంలో అలజడి..!
– ఇప్పటికే కేఎల్ఆర్ వర్గం ఓవైపు
– బీఆర్ఎస్ నేతల చేరికలతో చీలికలు..?
– ఎం.రమేష్ వర్గీయుల వల్ల అసంతృప్తులు
– తాండూరు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందంటే..?
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరులోని కాంగ్రెస్ పార్టీ మాంచి కదనోత్సహాంలో ఉంది. డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ దూకుడును కొనసాగిస్తోంది. కాని అన్నీ సవ్యంగా ఉన్నప్పటికి ఏదో కారణం వల్ల హస్తంలో అలజడులు కనిపిస్తుంటాయి. ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న పరిణామాలు అసక్తికరంగా మారాయి. డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి పార్టీలోకి రాకముందు మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి తాండూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఇందుకు టీపీసీసీ ఉపాధ్యక్షులు ఎం.రమేష్ మహారాజ్, ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, పలువురు కేఎల్ఆర్కు మద్దతు ఇచ్చారు. ఆయన తరుపున ప్రచారం కూడా చేశారు.
ఆ తరువాత అనూహ్యంగా మనోహర్ రెడ్డి చేరడంతో రమేష్ మహరాజ్, ధారాసింగ్ వ్యతిరేక వర్గీయులు మనోహర్ రెడ్డి వర్గంలో చేరారు. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను జోరుగా నిర్వహించారు. దీంతో కేఎల్ఆర్ వెనుకడుగు వేసినట్లు ప్రచారం జరిగింది. కాని తాండూరు టిక్కెట్టు కోసం స్టాటజీలు వాడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఓ దశలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని వర్గీయులు చర్చించుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కాని టిక్కెట్ ఎవరికి వచ్చినా పార్టీ కోసం పనిచేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
పార్టీలో అలజడి..
మరోవైపు డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి, డాక్టర్ సంపత్ కుమార్, శ్రీనివాస్ రెడ్డిల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు జరుగుతున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున చేరికలు జరుగుతున్నాయి. అంతేకాకుండా ఇటీవల మనోహర్ రెడ్డి టీపీసీసీ ఉపాధ్యక్షులు ఎం.రమేష్ మహరాజ్తో కలిసి మద్దతు ఇవ్వాలని కోరిన సంగతి తెలిసిందే. దీంతో ఎం.రమేష్ మహరాజ్ వర్గంకు చెందిన నేతలు మనోహర్ రెడ్డి వర్గంలో చేరిపోయారు.
ఓ వైపు బీఆర్ఎస్ పార్టీ నేతల చేరికలు, రమేష్ మహారాజ్ వర్గం నేతల చేరికలతో ముందు నుంచి మనోహర్ రెడ్డి కోసం పనిచేస్తున్న నేతలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మాజీ పట్టణ అధ్యక్షులు, కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ అనుచరులతో పట్టణంలోని ఓ హోటల్లో సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం మనోహర్ రెడ్డి దృష్టికి కూడా చేరింది. ఈ పరిణామాలను చక్కదిద్దేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి అసంతృప్తి వాతావరణం లేకుండా అందరికి ప్రాధాన్యం ఉండేలా కసరత్తు చేస్తున్నట్లు నేతలు అంటున్నారు. తాండూరు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందో అని అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.
ఇది కూడా చదవండి…

