ఒక‌టి కాదు.. రెండు..!

ఆరోగ్యం తాండూరు రంగారెడ్డి వికారాబాద్

ఒక‌టి కాదు.. రెండు..!
– వికారాబాద్‌, తాండూరులో మెడిక‌ల్ కాలేజీల‌ను ఏర్పాటు చేయాలి
– శాస‌న మండ‌లి స‌మావేశంలో గ‌ళ‌మెత్తిన ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్‌రెడ్డి
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: వికారాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వం మెడిక‌ల్ కాలేజీ ఏర్పాటుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న విష‌యం తెలిసిందే. అయితే వికారాబాద్ జిల్లాలో ఒక‌టి కాదు రెండు మెడిక‌ల్ కాలేజీల‌ను ఏర్పాటు చేయాల‌ని ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి కోరారు. సోమ‌వారం శాస‌న‌మండ‌లి స‌మావేశంలో ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్‌రెడ్డి ఈ ప్ర‌స్తావ‌న తెచ్చారు. తాండూరు, వికారాబాద్ జిల్లా కేంద్రలో వేరువేరు మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేయాల‌ని గళం విప్పారు. సీఎం కేసీఆర్ గత ఎన్నికల ప్రచారంలో భాగంగా తాండూరు ప్రచార సభలో తాండూరు ప్రాంతంలో ప్రత్యేక వైద్య కళాశాలలను ఏర్పాటు ఇస్తున్నట్లు ప్రకటించిన విష‌యాన్ని గుర్తుచేశారు. ఇటీవల ప్రభుత్వం జిల్లాకో వైద్య కళాశాలల ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలో తాండూరు, వికారాబాద్ జిల్లా కేంద్రంలో వేర్వేరుగా రెండు వైద్య కళాశాలల ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. కర్ణాటక సరిహద్దులోని తాండూరులో ఇప్పటికే జిల్లా ఆసుపత్రి ఉండి ప్రజల డిమాండ్ ఎక్కువగా ఉంద‌ని మండ‌లి దృష్టికి తెచ్చారు. మెడిక‌ల్ కాలేజీ ఏర్పాటు కోసం తాండూరు అన్ని సదుపాయాలు ఉన్నాయన్నారు. అలాగే వికారాబాద్ జిల్లా కేంద్రంలో వైద్య కళాశాల ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. ప్ర‌భుత్వం జిల్లాలో రెండు వైద్య కళాశాలలు ఏర్పాటు చేసి ప్రజా వైద్యాన్ని మెరుగుపర్చాలని మహేందర్ రెడ్డి కోరారు.