పదవి నుంచి దిగేదేలేదు..!
– తాండూరు మార్కెట్ కమిటి పాలకవర్గం రద్దు
– ఉత్తర్వులు జారీ చేసిన రేవంత్ సర్కారు
– హైకోర్టులో ఫిటిషన్ వేసిన చైర్ పర్సన్
– రసవత్తరంగా మార్కెట్ కమిటి రాజకీయం
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలోని తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటి పాలకవర్గంపై జరుగుతున్న రాజకీయం రసవత్తరంగా మారింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పాలకవర్గాన్ని రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేయడంతో ఆసక్తిని పెంచింది. అయితే పదవి దిగేది లేదన్నట్లుగా చైర్ పర్సన్ హైకోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది. తాండూరు నియోజ కవర్గంలో తాండూరు, కోట్పల్లి, బషీరాబాద్ వ్యవసాయ మార్కెట్లు ఉన్నాయి. కోట్‌పల్లి, బషీరాబాద్ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్‌లు శాసనసభ ఎన్నికల ముందుగానే కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో వారి పదవులకు ఎలాంటి డోకా లేకుండా పోయింది.
ఇక తాండూరు మార్కెట్ కమిటి చైర్ పర్సన్‌గా గతేడాది సెప్టెంబరు 12న వీణా శ్రీనివాస్ చారి బాధ్యతలు చేపట్టారు. బీఆర్ఎస్ పార్టీ అధికా రాన్ని కోల్పోవడంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత పలు చోట్ల మార్పులు జరిగాయి. ఈ నేపథ్యంలో తాండూరు మార్కెట్ కమిటి పాలకవర్గంపై కాంగ్రెస్ పార్టీ దృష్టిసారించింది. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఒక్క తాండూరు వ్యవసాయ మార్కెట్ పాలకవర్గాన్ని రద్దు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలకవర్గాన్ని రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయమై చైర్పర్సన్ వీణా హైకోర్టును ఆశ్ర యించారు. ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయకుండా తొలగింపుపై హైకోర్టును ఆశ్రయించారు.
మరోవైపు 2017-18 సంవత్సరంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా ఉన్న ఎం. సురేష్‌కు ఇదే విధంగా పరిణాలు జరగడంతో అప్పట్లో ఆయన హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. కొన్నినెలలు కొనసాగిన తర్వాత అప్పటి ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చి పాలకవర్గం రద్దు చేసింది. తాజాగా మార్కెట్ కమిటి చైర్ పర్సన్ వీణ కూడా హైకోర్టును ఆశ్రయించడంతో పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.
ఇదికూడా చదవండి..

