ఈనెల 25 నుంచి ఫ‌స్ట్ ఇయ‌ర్ ఎగ్జామ్స్

కెరీర్ తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి వికారాబాద్ హైదరాబాద్

70 శాతం సిలబస్‌ నుంచే ఇంటర్ పరీక్షలు
– ఈనెల 25 నుంచి ఫ‌స్ట్ ఇయ‌ర్ ఎగ్జామ్స్
– ప్రక‌టించిన తెలంగాణ‌ ఇంట‌ర్ బోర్డు
హైద‌రాబాద్, ద‌ర్శిని ప్ర‌తినిధి: 70 శాతం సిలబస్‌ నుంచే ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలంగాణ ఇంటర్‌ బోర్డు కార్యదర్శి జలీల్‌ తెలిపారు. ఈ మేర‌కు తెలంగాణలో ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షల నిర్వహణపై ఇంటర్‌ బోర్డు కీలక ప్రకటన చేశారు. 2020-21 విద్యాసంవ‌త్స‌రానికి చెందిన ప్రస్తుతం ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఈనెల 25 నుంచి మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయని వెల్ల‌డించారు. రెండో సంవత్సరంలో కాలేజీ మారిన విద్యార్థులు… మొదటి సంవత్సరం ఫీజు చెల్లించిన కాలేజీ జోన్ పరిధిలోనే పరీక్ష రాయాలని స్ప‌ష్టం చేశారు. 70 శాతం సిల‌బ‌స్ నుంచే ఎగ్జామ్స్ నిర్వహించ‌నున్నట్లు ఇంట‌ర్ బోర్డు అధికారులు స్పష్టం చేశారు. ప్రశ్నల్లో మరిన్ని మల్టీఫుల్ ఛాయిస్‌లు పెంచామన్నారు. ఉద‌యం 9 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు ఎగ్జామ్స్ జ‌రుగుతాయ‌న్నారు. నమూనా ప్రశ్నా పత్రాలు, పరీక్షల మెటీరియల్‌ను tsbie.cgg.gov.in వెబ్‌సైట్‌ ద్వారా అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఈ పరీక్ష నిర్వహణలో పూర్తిస్థాయిలో కోవిడ్ నిబంధనలు పాటిస్తామని అధికారులు తెలిపారు. వ్యాక్సిన్ తీసుకున్న సిబ్బందినే విధుల్లోకి తీసుకుంటామ‌న్నారు. ప్రతి ఎగ్జామ్ సెంట‌ర్‌లో ఒక‌ట్రెండు ఐసోలేష‌న్ సెంట‌ర్లు ఏర్పాటు చేస్తామ‌న్నారు. ఏఎన్ఎం లేదా స్టాఫ్ న‌ర్సు అందుబాటులో ఉంటార‌న్నారు.. విద్యార్థుల భవిష్యత్తు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొనే పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి, భయం లేకుండా పరీక్షలు ఎదుర్కోవాలన్నారు.

ప‌రీక్ష‌ల టైం టేబుల్ ఇలా..

అక్టోబ‌ర్ 25న సెకండ్ లాంగ్వేజ్
26న ఇంగ్లీష్
27న మ్యాథ్స్-1ఏ, బోట‌నీ, పొలిటిక‌ల్ సైన్స్
28న మ్యాథ్స్-1బీ, జువాల‌జీ, హిస్ట‌రీ
29న ఫిజిక్స్, ఎక‌నామిక్స్
30న కెమిస్ట్రీ, కామ‌ర్స్
న‌వంబ‌ర్ 1న ప‌బ్లిక్ అడ్మినిస్ట్రేష‌న్
2న మోడ్ర‌న్ లాంగ్వేజ్, జియోగ్ర‌ఫీ

.