మ‌ద్యం ప్రియుల‌కు షాక్..!

ఆరోగ్యం జాతీయం

మ‌ద్యం ప్రియుల‌కు షాక్..!
– రెండో డోసు వేసుకుంటునే మందు
– త‌మిళ‌నాడులోని ఓ జిల్లా క‌లెక్ట‌ర్ కీల‌క నిర్ణ‌యం
ద‌ర్శిని బ్యూరో: త‌మ జిల్లాను క‌రోనా ర‌హితంగా మార్చేందుకు అక్క‌డి జిల్లా యంత్రాంగం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ నిర్ణ‌యంతో ఆ ప్రాంత మ‌ద్యం ప్రియుల‌కు గ‌ట్టి షాక్ త‌గిలింది. కరోనా వైరస్ మహమ్మారి దేశాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే. ఇప్పడికే ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ సమయంలో ఎందరో ఆప్తుల్ని కోల్పోయి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకుంటే.. ప్రమాద తీవ్రత తక్కువ ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. దీంతో భార‌త దేశంలోని తమిళనాడు సర్కార్ వ్యాక్సినేషన్‌పై భారీగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వ్యాక్సిన్ వేసుకుంటే బహుమతులు ఇస్తూ ప్ర‌జ‌ల‌ను చైత‌న్య ప‌రుస్తోంది. ఇందుకోసం స్పెషల్ డ్రైవ్స్ కూడ నిర్వ‌హిస్తోంది. ఇందులో భాగంగా త‌మిళ‌నాడులోని మైలాడుతురై జిల్లా అధికార యంత్రాంగం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లాలోని మద్యం ప్రియులకు షాక్ ఇచ్చింది. కోవిడ్-19 రహిత జిల్లాగా మార్చేందుకు తోడ్పడాలని పిలుపునిచ్చిన కలెక్టర్ ఓ కీల‌క ప్ర‌క‌ట చేశారు. తమిళనాడు ప్రభుత్వం నియంత్రణలో ఉన్న టాస్మాగ్ దుకాణాలలో మద్యం కొనుగోలు చేసేవారు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ చూపెట్టాలనే నిబంధన పెట్టించారు. ప్రజలు ఈ ప్రక్రియకు పూర్తి సహకారం అందించాలని స్ప‌ష్టం చేశారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు టీకాలు వేసుకోలేని వారు కొందరు వ్యాక్సిన్ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. క‌లెక్ట‌ర్ తీసుకున్న నిర్ణ‌యానికి కొంతమంది నెటిజన్లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. మిగిలిన జిల్లాలతో పాటు తెలుగు రాష్ట్రాలు కూడా ఈ దిశగా ఆలోచన చేయాలని అభిప్రాయ ప‌డుతున్నారు.