రేషన్ ఈకేవైసీకి మరో చాన్స్..!
– గడువు పొడిగించిన కేంద్రం
– నమోదు ఎప్పటి వరకు అంటే..?
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : రేషన్ కార్డుల ఈకేవైసీకి కేంద్రం మరో చాన్స్ అందించింది. ఆధార్, రేషన్ కార్డుల అనుసంధానం గడువును మరోసారి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈకేవైసీ నమోదుకు ఈ నెల 30 తేదీ గడువు విధించింది. ఈ గడువును కాగా సెప్టెంబరు 30 వరకు పొడిగిస్తూ ఆహార, పౌరసరఫరాల విభాగం ప్రకటన జారీ చేసింది.

అక్రమాలకు చెక్ పెట్టేందుకు, పారదర్శకతకు కేంద్ర ప్రభుత్వం లబ్ధిదారుల ఈకేవైసీ విధానానికి పూనుకుంది. ఈకేవైసీ సేకరణ ప్రక్రియ ఏడాదిపైగా కొనసాగుతోంది. మొదట్లో లబ్ధిదారులు పోటెత్తడంతో గడువు విధించలేదు. ఆ తర్వాత పలు దఫాలుగా పెంచారు. నెలాఖరులో రేషన్ దుకాణాలు మూసి ఉండటంతో బతుకుదెరువు వలస వెళ్లేవారు ఆప్‌డేట్ చేసుకునే అవకాశం నిర్ణీత సమయంలో ఉండటం లేదు. ఆహార భద్రత కార్డుపై బియ్యం పొందాలంటే కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు రేషన్ దుకాణానికి వెళ్లాల్సి ఉంటుంది.

కుటుంబ సభ్యుల ఆధార్ సంఖ్య, దానికి అనుసంధానంగా ఉన్న చరవాణితో పాటు ఈపాస్ యంత్రాల్లో వేలిముద్ర వేయాల్సి ఉంటుంది. ఆధార్‌కు అనుసంధానంగా చరవాణి లేని కారణంగా ఓటీపీ రాకపోవడం, వేలిముద్రలు సరిపోక, కనుపాపలు గుర్తించక పలు రకాలుగా సాంకేతిక కారణాలతో ఇబ్బందులు పడ్డారు. వీలుగాక, ఆర్థిక ఇబ్బందుల కారణంగా దాటవేత ధోరణి అవలంబిస్తున్నారు. ఫలితంగా ఈకేవైసీ ఆలస్యమవుతోంది. ఈకేవైసీని వందశాతం పూర్తిచేయాలనే లక్ష్యంతో నమోదు గడువును పెంచుతూ వస్తోంది.

ఇదికూడా చదవండి….

