చిరంజీవి కుడి చేతికి సర్జరీ
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: టాలీవుడ్ మెగాస్టార్ కుడిచేతికి జరిగిన సర్జరీ ఆదివారం వెలుగులోకి వచ్చింది. కరోనా మహమ్మారి రెండో దశ విరుచుకు పడుతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో చిరంజీవి రెండు తెలుగు రాష్ట్రాల్లో, జిల్లా స్థాయిలో ఆక్సిజన్ బ్యాంకు నెలకొల్పిన సంగతి తెలిసిందే.. ఈ ఆక్సిజన్ బ్యాంకు సేవలలో అన్ని జిల్లాల మెగా అభిమాన సంఘాల ప్రతినిధులు కూడా పాలుపంచుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం నాడు తెలంగాణ జిల్లాల ఆక్సిజన్ బ్యాంకుల సేవలో పాల్గొన్న ప్రతినిధులను పిలిచి మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా అభినందించారు. హైదరాబాద్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో చిరంజీవి పాల్గొనగా ఆయన కుడి చేతికి బ్యాండేజ్ లా ఉండడం అభిమానులందరినీ కలవరపెట్టింది.
ఏమైంది అని అభిమానులు చిరంజీవిని ప్రశ్నించగా చిరంజీవి అసలు విషయం చెప్పారు. తన అరచేతికి చిన్నపాటి సర్జరీ అయింది అనే విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు. కుడి చేతితో ఏ పని చేయాలన్నా కొంచెం నొప్పిగా, తిమ్మిరి ఏర్పడుతున్నట్టు అనిపించడంతో డాక్టర్ ను సంప్రదించానని వెల్లడించారు. అయితే కుడి చేతి మణికట్టు దగ్గరలో ఉన్న మీడియన్ నర్వ్ అనే నరం మీద ఒత్తిడి పడటం వల్ల అలా అనిపిస్తోందని దానిని కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ అంటారని డాక్టర్లు వెల్లడించినట్లు పేర్కొన్నారు. అపోలో ఆసుపత్రిలో కాస్మొటిక్ సర్జన్ డాక్టర్ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో చేతికి సర్జరీ జరిగిందని.. 45 నిమిషాల పాటు జరిగిన సర్జరీలో మీడియన్ నర్వ్ చుట్టుపక్కల ఉన్న టిష్యూలను సర్జరీ ద్వారా సరి చేసి, ఒత్తిడి తగ్గించారని మెగాస్టార్ పేర్కొన్నారు.

