ఇంటిగ్రేటేడ్ మార్కెట్ ఇంకెంత దూరమో..!
– ప్రారంభం కాని నిర్మాణ పనులు
– మళ్లీ రోడ్డుపైకి వస్తున్న వ్యాపారాలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: పండ్లు, పూలు, మటన్, చికెన్ దుకాణాలను ఒకే చోటకు తెచ్చేలా ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్(సమీకృతం) మార్కెట్ తాండూరులో ఆలస్యం అవుతోంది. ప్రభుత్వం నిధులు వెచ్చించినప్పటికి నిర్మాణ పనుల్లో జాప్యం ఎందుకవుతోందనని పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తాండూరు మున్సిపల్ పరిధిలోని 36 వార్డుల్లో దాదాపు 71 వేల జనాబా ఉంది. వీరితో పాటు వివిధ ప్రాంతాల నుంచి 14 వేల మంది దాక పలు అవసరాల నిమిత్తం తాండూరుకు వస్తుంటారు. పట్టణ ప్రజలతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు వారికి కావాల్సిన కూరగాయలు, పండ్లు, మటన్, చికెన్ కొనుగోలు కోసం పట్టణంలోని వినాయక చౌరస్తా, రైల్వేస్టేషన్ రోడ్డు, పాత కూరగాయల మార్కెట్, కొత్త కూరగాయల మార్కెట్, బసవణ్ణకట్ట, శివాజీ చౌక్ ప్రాంతాలకు అటు ఇటూ తిరుగుతుంటారు.
అయితే ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని దుకాణాలను ఒకే చోట ఏర్పాటు చేసేందుకని ఇంటిగ్రేటేడ్ మార్కెట్ వ్యవస్థను తీసుకవచ్చింది. తాండూరులోని రైతు బజార్‌ను ఇంటిగ్రేటేడ్ మార్కెట్‌గా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఇందుకోసం ప్రత్యేక శ్రద్ద చూపించారు. తాండూరులో ఏర్పాటు చేసే ఇంటిగ్రేటేడ్ మార్కెట్ కోసం రూ. 2.50 నిధులను మంజూరు చేశారు. అదేవిధంగా తాండూరు మున్సిపల్ నుంచి కూడ మరిన్ని నిధులు వెచ్చించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో రూ. 4.50 కోట్లతో ఇంటిగ్రేటేడ్ మార్కెట్ ఏర్పాటు చేస్తుంటే ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి విజ్ఞప్తి మేరకు అట్టి నిధులను రూ. 8.50 కోట్లకు పెంచడం జరిగిందని
గత మూడు నెలల క్రితం పట్టణ ప్రగతిలో పాల్గొన్న విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. దీంతో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్‌లు ఇంటిగ్రేటేడ్ మార్కెట్ నిర్మాణ పనుల ప్రక్రియను వేగవంతం చేశారు. గత రెండు నెలల నుంచి ఇంటిగ్రేటేడ్ మార్కెట్ నిర్మాణ పనుల్లో ఎలాంటి చలనం కనిపించక పోవడంతో అప్పటి వరకు రైతు బజార్‌లో ఉన్న దుకాణాలన్ని మళ్లీ రోడ్లపైకి వస్తున్నాయి. దీంతో పట్టణ రోడ్లపై మళ్లీ ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.
త్వరలోనే కార్యాచరణ :
అశోక్ కుమార్ – ఆర్డీఓ, మున్సిపల్ ఇంచార్జ్ కమీషనర్
తాండూరు పట్టణంలో ఏర్పాటు చేయబోయే ఇంటిగ్రేటేడ్ మార్కెట్‌పై ప్రణాళికలు సిద్దం చేయడం జరిగింది. త్వరలోనే కార్యాచరణ రూపొందించి పనుల ప్రారంభానికి చర్యలు తీసుకుంటాం. ఇంటిగ్రేటేడ్ మార్కెట్ ఏర్పాటు అనంతరం రోడ్లపైకి వెళ్లిన అన్ని దుకాణాలను ఒకే చోటుకు తరలించేలా దృష్టి సారించడం జరుగుతుంది.