వరధ కష్టాలకు యాక్షన్ ప్లాన్..!
– నాలా కబ్జాలను తొలగించండి
– ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గొద్దు
– రూ. 16 కోట్లతో చిలుకవాగు అభివృద్ధి
– పట్టణంలో అండర్ డ్రైనేజీ వ్యవస్థపై దృష్టి
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
– వర్షాకాలం ఇబ్బందులపై ఎమ్మెల్యే సమీక్ష
తాండూరు, దర్శిని ప్రతినిధి : వరధ నీటి కష్టాలు ప్రజలను ఇబ్బందులు పెట్టకుండా యాక్షన్ ప్లాన్ చేపట్టాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అధికారులు, ప్రజా ప్రతినిధులను ఆదేశించారు. సూచించారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ తో కలిసి మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి, తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, రెవెన్యూ, ఆర్అండ్బీ ఇతర శాఖల అధికారులతో వర్షాకాలం అప్రమత్త చర్యలపై సమీక్ష నిర్వహించారు.

ఆదివారం కురిసిన చిన్న పాటి వర్షానికే అన్ని వార్డుల్లో వరధ నీరు ప్రవహించడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఇకపై అలాంటి పరిస్థితి రాకుండా తీసుకోబోయే చర్యలపై చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తాండూరులో 20 ఏండ్ల క్రిందట ఏర్పాటు చేసిన డ్రైనేజీ వ్యవస్థతో నరధ కష్టాలు వచ్చాయన్నారు. దీనికి తోడు నాలాలు కబ్జాలు కావడం మరో కారణమని చెప్పుకొచ్చారు. తాండూరులో వరధ నీటి కష్టాలు రాకుండా ముకుతాడు వేసే చర్యలు చేపడుతున్నామన్నారు. నాలాలపై ఏర్పాటు చేసిన కబ్జాలను తొలగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. నాలా కబ్జాలను ప్రక్షాళన చేసేందుకు ప్రజా ప్రతినిధులు. ప్రజలు సహకరించాలన్నారు.
తాండూరులోని పాలిషింగ్ యూనిట్ల వ్యర్థాల వల్ల కూడా డ్రైనేజీ, నాలాలో నీటి ప్రవాహనికి ఇబ్బందులు ఏర్పడుతున్నట్లు గుర్తించామన్నారు. ఇందుకు వ్యర్థాలు పారబోయకుండా చర్యలు తీసుకోవాలని పాలిషింగ్ యూనిట్ యజమానులకు సూచించారు. అదేవిధంగా చిలుక వాగు అభివృద్ధి కోసం రూ. 16 కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. చిలుక వాగు అభివృద్ధి జరిగితే వరధ కష్టాలు ఉండవని అన్నారు. యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టి.. వరధ ముంపు సమస్యలు రాకుండా నాలా కబ్జాలను ప్రక్షాళన చేస్తామన్నారు. ఇందులో ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గే ప్రసక్తే లేదన్నారు.

ప్రజల విశ్వాసానికి అనుగుణంగా పనిచేస్తామని అన్నారు. భవిష్యత్తులో అండర్ డ్రైనేజీ వ్యవస్థ తీసుకవచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయడం జరుగుతుందన్నారు. మరోవైపు తాండూరు పట్టణం విలియమూన్ చౌరస్తా నుంచి హైదరాబాద్ రోడ్డు మార్గంలో ఉన్న విద్యుత్ దీపాల నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆర్అండ్ బీ శాఖ పర్యవేక్షణలో సంబంధిత కాంట్రాక్టర్ ద్వారా నిర్వహణ చేయిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ప్రభాకర్ గౌడ్, పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి, విజయాదేవి, సాహు శ్రీలత, రాము, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, నాయకులు సాయిపూర్ బాల్ రెడ్డి, మున్సిపల్, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

