సబ్ కోర్టు ఏర్పాటుకు కృషి
– త్వరలోనే అడిషనల్ కోర్టు ప్రారంభం
– జిల్లాలో 17వేల పెండింగ్ కేసులు
– కేసుల సత్వర న్యాయం కోసం దృష్టి
– జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి సున్నం శ్రీనివాస్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో సబ్ కోర్టు ఏర్పాటు కోసం కృషి చేయడం జరుగుతుందని వికారాబాద్ జిల్లా న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి సున్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం తాండూరులోని జూనియర్ సివిల్ జడ్జీ న్యాయస్థానంలో ఏర్పాటు చేస్తున్న అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జీ న్యాయస్థానంను సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి సున్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తాండూరులో సబ్ కోర్టు పెండింగ్ లో ఉందని చెప్పుకొచ్చారు. ఇందుకోసం స్థలాన్ని గుర్తించే పనిలో ఉన్నట్లు తెలిపారు. అన్ని ప్రణాళికలు సిద్ధం చేసిన తరువాత హైకోర్టు దృష్టికి తీసుకవెళ్లి తాండూరులో సబ్ కోర్టు ఏర్పాటుకు కృషి చేయడం జరుగుతుందన్నారు.
దీంతో పాటు తాండూరులో మంజూరైన అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జీ న్యాయస్థానం ప్రారంభానికి సిద్ధమయ్యిందని తెలిపారు. త్వరలోనే ఆడిషనల్ న్యాయస్థానాన్ని ప్రారంభించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా జిల్లాలో 17 వేలకు పైగా పలు అంశాలకు సంబంధించిన కేసులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. కేసుల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇప్పటికే సుప్రీం కోర్టు ఆదేశాలతో నిర్వహిస్తున్న లోక్ అదాలత్ ద్వారా ఇటీవల 3500లను రాజీ కుదర్చడం జరిగిందన్నారు. అంతేకాకుండా జిల్లాలోని న్యాయస్థానాలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
అంతకుముందు కోర్టు పరిసర ప్రాంతాలను పరిశీలించి సమస్యలను ఆరా తీశారు. అనంతరం తాండూరు బార్ అసోసియేషన్ సభ్యులు ప్రధాన న్యాయమూర్తి సున్నం శ్రీనివాస్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు న్యాయమూర్తి చంద్రకిషోర్, తాండూరు న్యాయమూర్తి శివలీల. బార్ అసోసియేషన్ అధ్యక్షులు అగ్గనూర్ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి చంద్ర శేఖర్ రెడ్డి, సీనియర్ న్యాయవాదులు రాంరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి. రవిందర్, శ్రీనివాస్, బాలి శివకుమార్, న్యాయవాదులు. బార్ అసోసియేషన్ సభ్యులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.
ఇదికూడా చదవడి…

