ధరణి నిర్వహణలో మార్పులు
– ఎన్ఐసీకి బాధ్యతలు రేవంత్ సర్కార్
– ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
– నిర్ణయంలో కీలక అంశాలు
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మార్పులు చేసింది. ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలను ఎన్ఐసీకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ధరణి బాధ్యతలు నిర్వహిస్తున్న టెరాసిస్ ప్రైవేటు సంస్థను కాదని, కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ ఇన్‌ఫర్మేటిక్ సెంటర్ కి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ఎన్ఐసీతో కీలక ఒప్పందం చేసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. మూడేళ్ల పాటు ధరణి నిర్వహణ బాధ్యతలు నిర్వహించనుంది.
ఎన్ఐసీ పనితీరు బాగుంటే మరో రెండేళ్లు నిర్వహణ బాధ్యతలను పొడిగించనున్నట్లు రేవంత్ రెడ్డి సర్కార్ తెలిపింది. గత ప్రభుత్వం తీసువచ్చిన ధరణి పోర్టల్‌లో నెలకొన్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి సర్కార్ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా టెరాసిస్ నుంచి ఎన్ఐసీకి అప్పగించినట్లు నిర్ణయం తీసుకుంది. ఈ మార్పు ద్వారా ప్రభుత్వానికి దాదాపు కోటి రూపాయల నిర్వహణ భారం కూడా తగ్గుతుందని రెవెన్యూ అధికారులు భావిస్తున్నారు.
అయితే ధరణి పోర్టల్‌కు చెందిన సాంకేతిక అంశాలను పూర్తి స్థాయిలో ఎన్ఐసీకి బదలాయించనున్నారు. నవంబరు 30వ తేదీ వరకు టెరాసిస్ సంస్థ సిబ్బంది ఎన్ఐసీకి సహకరిస్తారని రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటర్ నవీన్ మిట్టల్ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా సీఎం రేవంత్ రెడ్డి సర్కారు ధరణి స్థానంలో భూమాత కొత్త ఆర్వోఆర్ చట్టాన్ని తీసుకవచ్చేందుకు కసరత్తు చేస్తోంది.
ఇదికూడా చదవండి…

