గంజాయి సాగుచేస్తే పథకాలు బంద్
– కఠిన ఆదేశాలు ఇస్తున్న సర్కారు
– రైతులపై కేసుల నమోదుకు చర్యలు
– జిల్లాలో వెలుగులోకి వస్తున్న కేసులు
వికారాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా త్రీ జీ లపై ఉక్కుపాదం మోపుతోంది. గంజాయి.. గుడుంబా.. గుట్కా నియంత్రణ లక్ష్యంగా చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా గంజాయిపై దృష్టిసారించి సాగు చేస్తున్న రైతులపై కఠినంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్లతో పాటు వ్యవసాయ, ఎక్సైజ్ శాఖల అధికారులకు ఆదేశాలు జారి చేసిన విషయం తెలిసిందే. దీంతో గంజాయి సాగు రైతులపై అధికార యంత్రాంగం నిఘా ఉంచుతోంది. వికారాబాద్ జిల్లాలో ఇటీవల కాలంలో రైతులు పంట పొలాల్లో గంజాయి సాగు చేసిన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. గత
కొన్ని రోజుల క్రితం కోడంగల్ నియోజకవర్గంలో, తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండలం రచ్చకట్ట తాండాలో, బంటారం మండల కేంద్రంలో గంజాయి సాగు చేస్తున్న రైతులను గుర్తించి ఎక్సైజ్ అధికారులు మొక్కలు స్వాదీనం చేసుకుని, మిగతా వాటిని ద్వంసం చేశారు. తాజాగా పరిగి మండల పరిధిలోని కాళ్లపూర్, జప్పార్ పల్లిలో రైతులు పత్తి పంట మాటున గంజాయి సాగును గుర్తించి మొక్కలను ద్వంసం చేశారు. ఇలా వరుస సంఘటనలతో అధికారులు గంజాయి సాగు నియంత్రణకు దృష్టిసారించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇకపై ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా గత సోమవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ కె.నిఖిల ఈ విషయంపై అబ్కారీ శాఖ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లాలో గంజాయి సాగుచేసే రైతులను గుర్తించి కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. గంజాయి సాగు చేసిన రైతులకు ఇకపై ప్రభుత్వ పథకాలు వర్తించకుండా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. రైతు బంధు, రైతు భీమా, పెన్షన్లు నిలిపివేస్తామని స్పష్టం చేశారు. గంజాయి సాగుపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కొందరు రైతులు సమర్థించగా.. ఇంకొందరి రైతుల్లో గుబులు మొదలైంది.
