బీజేపీ జోష్…!
– అట్టహాసంగా విజయోత్సవ సంబరాలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: హుజూరాబాద్ ఉప పోరులో బీజేపీ విజయం సాధించడపట్ల తాండూరు బీజేపీ నేతలు జోష్‌ను ప్రదర్శించారు. మంగళవారం బీజేపీ వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి యు.రమేష్ కుమార్ ఆధ్వర్యంలో
విజయోత్సవ సంబరాలను అట్టహాసంగా జరుపుకున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిపై ఈటెల రాజేందర్ గెలుపొందడం పట్ల నాయకులతో కలిసి కేక్‌ను కట్ చేశారు. పార్టీ కార్యాలయం నుంచి నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన చౌరస్తాల మీదుగా ర్యాలీ కొనసాగింది. బీజేపీ గెలుపుకు అనుగుణంగా నాయకులు నినాదాలు చేస్తూ ముందుకుసాగారు. బ్యాండ్ బాజాలతో నాయకులు, కార్యకర్తలు హుషారెత్తించారు.
తాండూరు మండలంలో

తాండూరు మండలం జినుగుర్తి గ్రామంలో బీజేపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. తాండూరు మండల పార్టీ అధ్యక్షులు శేఖాపురం ఆంజనేయులు ఆధ్వర్యంలో జినుగుర్తి గ్రామ గేటు సమీపంలో నిర్వహించిన సంబరాలలో వివిధ గ్రామాల నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆంజనేయులు ఆధ్వర్యంలో ఈటెల రాజేందర్ గెలుపుపై పెద్ద ఎత్తున బాణా సంచాలు పెల్చారు. ఒకరికొకరు స్వీట్లు పంచుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు.


