వీళ్లెక్కడి దొంగలు రా బాబు..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

వీళ్లెక్కడి దొంగలు రా బాబు..!
– అర్దరాత్రి స్కార్పీయోలో వచ్చి గొర్రెల చోరీ
– సీసీ కెమెరాలో దొంగతనం వీడియోల రికార్డు
– తాండూరు మండలంలో ఘటన
– కరణ్ కోట్ పోలీస్టేషన్‌లో కేసు నమోదు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : ఎవరి అవసరాల కోసం వాళ్లు ఎన్నో వింత దొంగతనాలు చేస్తుంటారు. కాని ఇక్కడ ఓ వింత దొంగతనం గురించి చదువుకోబోతున్నాము. అర్ధరాత్రి స్కార్పీయోలో ఊరి మీది పడి గొర్రెలను చోరీ చేశారు ఈ ఘనులు. ఈ సంఘటన తాండూరు మండలం గౌతాపూర్ బుధవారం అర్ధరాత్రి జరిగింది. కరణ్ కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

గ్రామానికి చెందిన జన్నె పెద్ద రాములు జీవనోపాధి కోసం గొర్రెలను మేపుతున్నారు. ప్రతి రోజూ బయటకు తీసుకవెళ్లి సాయంత్రానికి ఇంటికి తీసుకవస్తారు. వాటిని ఇంటి సమీపంలో ఉన్న పాకలో ఉంచుతారు. గొర్రె పిల్లలు కూడా అందులోనే ఉంటాయి. రోజూ మాదిరిగానే గొర్రెలను, పిల్లలను పాకకు తాళం వేసి ఇంట్లో పడుతున్నారు. సరిగ్గా బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత సుమారు 1గంట ప్రాంతంలో గుర్తుతెలియని దుండగులు స్కార్పీయో వాహనంలో రాములకు చెందిన గొర్రెల పాక వద్దకు చేరుకున్నారు. ఇంట్లో వాళ్లు నిద్రించారని నిర్దారించుకుని పాకలోకి చొరబడ్డారు. కొద్ది సేపట్లోనే గొర్రెలతో వచ్చిన స్కార్పీయోలో ఉడాయించారు.

గురువారం తెల్లవారు జాము తరువాత చూసిన రాములు అటు.. ఇటు వెతికినా వాటి ఆచూకీ తెలియరాలేదు. పరిసర ప్రాంతంలోని సీసీ కెమెరాలో పరిశీలించగా చోరీ జరిగినట్లు ఆందోళనకు గురయ్యారు. 6 గొర్రెలతో పాటు ఒక పోట్టేలును కూడా దొంగలు ఎత్తుకెళ్లినట్లు బాధితుడు ఫిర్యాదు చేశారని ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. మరోవైపు ఆపహరణకు గురైన గొర్రెల పిల్లలు తల్లుల కోసం.. పాల కోసం తల్లడిల్లుతున్నాయని బాధితుడి భార్య జగ్గమ్మ ఆవేధన వ్యక్తం చేశారు.

ఇదికూడా చదవండి…

రెండో రోజూ 18 మంది గైర్హాజరు..!