ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోరు..!
– ఉమ్మడి పాలమూరులో ఎన్నికల నగారా
– వికారాబాద్ జిల్లాలో ఎన్నికల కోడ్ అమలు
– తాండూరులో నేతల విగ్రహాలకు ముసుగు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి పాలమూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు ఎన్నికల నగారా మోగింది. ఈమేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను ప్రకటించింది. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు వికారాబాద్ జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. మహబూబ్నగర్ స్థానిక సంస్థల నియోజక వర్గ శాసనమండలి పరిధిలోని మహబూబ్నగర్, నారాయణపేట, జోగుళాంబ గద్వాల, నాగర్కర్నూల్, వనపర్తి, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఎన్నికల కోడ్ తక్షణం అమలులోకి వచ్చిందని ఆ జిల్లా కలెక్టర్ తెలిపారు.
షెడ్యూల్ ప్రకారం మార్చి 4వ తేదీన నోటిఫికేషన్ జారీ, నామి నేషన్లకు తుది గడువు మార్చి 11, మార్చి 12న నామినే షన్ల పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 14 తుది గడువు, మార్చి 28 ఉదయం 8 గంటల నుంచి సాయంత్ర 4 గంటల వరకు పోలింగ్, ఏప్రిల్ 2న ఓట్ల లెక్కింపు, ఏప్రిల్ 4తో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని ఆయన తెలిపారు. సభలు, సమావేశాలు, ర్యాలీలు, మైక్ అనుమతులు, వాహన అనుమతులను ఆయా జిల్లాల కలెక్టర్ల నుంచి పొందాలని స్పష్టం చేశారు.
ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు ఎందకంటే..?
ఉమ్మడి పాలమూరులో స్థానిక సంస్థల కోటా కింద రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఉండగా.. ఒక ఎమ్మెల్సీ స్థానంలో కూచకుళ్ల దామోదర్ రెడ్డి కొనసాగుతు న్నారు. రెండో స్థానంలో కశిరెడ్డి నారాయణరెడ్డి కొనసాగుతున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీచేసి గెలుపొందడంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఖాళీని భర్తీ చేసేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.
తాండూరులో నేతల విగ్రహాలకు ముసుగు
ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో తాండూరులో అధికారులు పట్టణంలో ఉన్న నేతల విగ్రహాలకు మసుగు వేశారు. పట్టణంలోని ఇందిరా చౌరస్తాలో ఇందిరమ్మ, ఫ్రోఫెసర్ జయశంకర్, మాజీ మంత్రి మాణిక్ రావు, రాజీవ్ కాలనీలో రాజీవ్ గాంధీ, మాజీ సీఎం వైఎస్ఆర్ విగ్రహాలతో పాటు వివిధ ప్రాంతాల్లో రాజకీయ నేతల విగ్రహాలకు ముసుగు వేశారు.
ఇది కూడా చదవండి..

