పులి పిల్ల కోసం నిఘా..!
– మల్కాపూర్ లో ట్రాఫ్ కెమెరాల ఏర్పాటుకు చర్యలు
– నిర్ణయించిన తాండూరు అటవి శాఖ అధికారులు
– ఎక్కడ, ఎన్ని రోజులు ఏర్పాటు చేస్తారంటే..?
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలంలో పులి పిల్ల సంచరిస్తున్నట్లు వస్తున్న పుకార్లకు చెక్ పెట్టేందుకు స్థానిక అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు ట్రాఫ్ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గత రెండు రోజుల క్రితం తాండూరు మండలం మల్కాపూర్ సమీపంలోని సిమెంట్ కర్మాగారం సమీపంలో పులిపిల్ల కనిపించినట్లు కార్మికులు అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.

గతనెలలో కూడా కోటబాస్పల్లి సమీపంలో ఓ పులిపిల్లను గుర్తించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. కొన ఊపిరితో ఉన్న పులి పిల్లకు చికిత్స అందిస్తుండగానే మృతి చెందింది. అయితే తాండూరు మండలంలో పులి పిల్లలు తిరుగుతున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మల్కాపూర్ ఫ్యాక్టరీ వద్ద పులి పిల్ల కనిపించిందని కార్మికులు ఫిర్యాదు చేయడంతో తాండూరు రేంజ్ ఆఫీసర్ శ్రీదేవి సరస్వతి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అయితే కార్మికులు పులి పిల్ల కనిపించిందని బలంగా చెప్పడంతో పరిసర ప్రాంతాలను పరిశీలించారు.

అక్కడక్కడా పాద ముద్రలను కూడా గుర్తించారు. అయితే అవి పిల్లివా.. పులి పిల్లివా అని నిర్ధారణ కాలేదు. సమీప ప్రాంతాల్లో పులి పిల్లలు సంచరిస్తుండడంతో పులి కూడా ఉండొచ్చని కార్మికులు, గ్రామ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. వీటికి చెక్ పెట్టేందుకు అటవీ శాఖ అధికారులు నిర్ణయించారు. పులి పిల్లను గుర్తించేందుకు సోమవారం ఫ్యాక్టరీ సమీపంలో 3 ట్రాఫ్ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. మూడు రోజుల పాటు కెమెరాలను ఏర్పాటు చేసి పులి పిల్ల, పులి కోసం నిఘా ఉంచుతామని తెలిపారు. ఒక వేళ పులి పిల్లలు, పులి కనిపిస్తే జాగ్రత్త చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అప్పటి వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇదికూడా చదవండి…

