క‌ల్తీ మ‌ద్యం సేవించి 24 మంది మృతి

జాతీయం

క‌ల్తీ మ‌ద్యం సేవించి 24 మంది మృతి
– ప‌లువురికి అస్వ‌స్థ‌త‌
ద‌ర్శిని బ్యూరో : బీహార్‌లో న‌కిలీ మ‌ద్యం సేవించి 24 మంది ప్రాణాలు కోల్పోగా.. ప‌లువురు తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. ఈ సంఘ‌ట‌న రాష్ట్రంలోని గోపాల్‌గంజ్‌, వెస్ట్ చంపార‌న్ జిల్లాల్లో చోటు చేసుకుంది. వెస్ట్ చంపారన్ జిల్లాలోని తెల్హువా గ్రామంలో 8 మంది చ‌నిపోయారు. గోపాల్‌గంజ్ జిల్లాలో 16 మంది మృతి చెందారు. అయితే వీరంతా న‌కిలీ మ‌ద్యం సేవించిన త‌ర్వాతే చ‌నిపోయిన‌ట్లు అధికారులు పేర్కొన్నారు. మృత‌దేహాల‌కు పోస్టుమార్టం నిర్వ‌హిస్తామ‌ని, ఆ త‌ర్వాతే వారి మ‌ర‌ణాల‌కు గ‌ల క‌చ్చిత‌మైన కారణం తెలుస్తోంద‌ని గోపాల్‌గంజ్ పోలీసులు వెల్ల‌డించారు. అయితే మృతుల్లో దాదాపు 20 మంది ఎస్టీలే ఉన్న‌ట్లు పోలీసులు తెలిపారు. స్థానికంగా త‌యారు చేసిన మ‌ద్యం సేవించిన త‌ర్వాతే వీరు చ‌నిపోయిన‌ట్లు ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేలింద‌ని చెప్పారు. మ‌రోవైపు సీఎం నితీష్ కుమార్ బీహార్‌లో మ‌ద్య‌పాన నిషేధం విధించిన సంగ‌తి తెలిసిందే. న‌కిలీ మ‌ద్యం సేవించి ఈ ఏడాది జ‌న‌వ‌రి నుంచి అక్టోబ‌ర్ 31 వ‌ర‌కు 70 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా చోటు చేసుకున్న ప‌రిణామాల‌పై బీహార్ మంత్రి జ‌న‌క్ రామ్ గోపాల్‌గంజ్ జిల్లా వెళ్లి ప‌రిస్థితిని స‌మీక్షించారు. న‌కిలీ మ‌ద్యం సేవించి ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించిన‌ట్లు మంత్రి తెలిపారు.