మ‌ర‌ణించిన భ‌ర్త‌తో సంతానం..!

ఆరోగ్యం జాతీయం టెక్నాలజీ తెలంగాణ

మ‌ర‌ణించిన భ‌ర్త‌తో సంతానం..!
– సైన్స్ స‌హాయంతో పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌
– తెలంగాణ రాష్ట్రంలో వెలుగులు చూసిన ఘ‌ట‌న
ద‌ర్శిని డెస్క్ : బిడ్డ‌కు త‌ల్లిదండ్రులు అయ్యే అవ‌కాశం అంద‌రి దంప‌తుల‌కు ల‌భించ‌దు. అమ్మా, నాన్న‌లు అనిపించుకునేందుకు ఏళ్ల త‌ర‌బ‌డి ఎదురు చూస్తారు. ఎన్నో పూజ‌లు, వ్ర‌తాలు పాటు వైద్య ప‌రిజ్ఞాన్నాన్ని ఆశ్ర‌యిస్తారు. కాని ఓ మ‌హిళ‌ భ‌ర్త మ‌ర‌ణించిన త‌రువాత అత‌ని ద్వారానే సంతానాన్ని పొందాల‌నుకుంది. వైద్య సాంకేతిక ప‌రిజ్ఞానం ద్వారా భ‌ర్త ద్వారా బిడ్డ‌ను పొందేందుకు ఏకంగా కోర్టును ఆశ్ర‌యించి చ‌ట్ట‌ప‌ర‌మైన‌, న్యాయ‌ప‌ర‌మైన ఇబ్బందుల‌ను దాటుకుని ఇటీవ‌లే పండండి శిశువుకు జ‌న్మ‌నిచ్చింది. ఈ సంఘ‌ట‌న తెలంగాణ రాష్ట్రంలో వెలుగులోకి వ‌చ్చింది. వివ‌రాల్లోకి వెళితే…
మంచిర్యాలకు చెందిన ఓ జంటకు 2013 లో వివాహమైంది. అయితే ఈ జంటకు ఎంతకాలానికి పిల్లలు పుట్టలేదు. దీంతో ఈ దంపతులు వరంగల్ లోని ఒయాసిస్‌ సంతాన సాఫల్య కేంద్రాన్ని ఆశ్రయించారు. 2020 నుంచి చికిత్స తీసుకుంటున్నారు. దీంతో 2020 మార్చిలో సంతాన సాఫల్య కేంద్ర వైద్యులు పరీక్షల నిమిత్తం భార్యాభర్తల నుంచి అండం, వీర్యం సేకరించి భద్రపరిచారు. అయితే భార్యాభర్తలను దురదృష్టం వెంటాడింది.. పిల్లలు కావాలన్న కోరిక తీరకుండానే 2021 లో భర్తకు కరోనా సోకి మరణించాడు. దీంతో చిన్న వయసులో భర్తను పోగట్టుకున్న కోడలికి అత్తమామలు అండగా నిలబడ్డారు. మరో పెళ్లి చేసుకోమని కోడలికి సూచించారు. అయితే తాను మరో పెళ్లి చేసుకోనని.. అత్తమామలతో ఉంటానని తెలిపారు. అంతేకాదు.. సంతాన సాఫల్య కేంద్రంలో భర్త వీర్యం ద్వారా తాను తల్లిని కావాలని అనుకున్నారు. ఇదే విషయాన్ని అత్తమామలకు తెలిపారు. అందరి అంగీకారంతో ఆధునిక వైద్యసాయం అందుకున్నారు. వైద్య నిపుణుల సలహాలను సూచనలు తీసుకున్నారు. అయితే ముందుగా తాను తల్లి అయ్యే విషయంలో ఎటువంటి చట్టపరమైన, న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కోకూడదని భావించి హైకోర్టుకి వెళ్లారు. దీంతో కోర్టు ఆ మహిళ ఇష్టమే ఫైనల్ అని తీర్పు చెప్పింది.

దీంతో ఆ మహిళ సంతాన సాఫల్య కేంద్రలో దంపతుల నుంచి సేకరించి భద్రపరచిన వీర్యం, అండాల ద్వారా వైద్య బృందం ఐవీఎఫ్‌ చికిత్స ప్రారంభించారు. ఆగస్టు 2021లో ఆసుపత్రి సిబ్బంది ఐవీఎఫ్‌ చికిత్స ప్రారంభించారు. వారి చికిత్స సక్సెస్ అయింది. మహిళ గర్భవతి అయింది. ఇటీవ‌లే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.