అరగంట వానలో భీభత్సం..!
– దంచికొట్టిన వానకు అతలాకుతలం
– తాండూరులో భారీ వర్షంతో ఇబ్బందులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : కురిసింది అరగంట వానే అయినా నానా హంగామా సృష్టించింది. తాండూరు పట్టణంలో గురువారం సాయంత్రం కురిసిన భారీ వర్షంతో భీభత్సం జరిగింది. ఈదురు గాలులతో ప్రారభమైన వాన క్షణాల్లోనే జోరందుకుంది. జోరు వానలోనే ఈదురు గాలులు బలంగా వీచాయి.

అరగంట పాటు నలుదిక్కుల వైపు నుంచి వర్షం కురిసింది. వానకు పట్టణంలోని మురుగు కాలువలు నిండి పొంగిపోర్లాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పట్టణంలోని శాంతినగర్ లో మురుగు నీరు గోదారిగా ప్రవహించింది. ఈ నీరంతా ఇండ్లలోకి మళ్లింది. ఈ మార్గంలో వచ్చిన ఓ ఆటో మోరాయించింది. అదేవిధంగా తాండూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ లో బోర్డు విరిగి పడింది. దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.

దీంతో పాటు భద్రేశ్వర జాతర ఉత్సవాల సందర్భంగా పట్టణంలోని ఇందిరా చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాల తొరణం ధ్వంసమై పోయింది. జోరు వాన, గాలులతో విరిగి రోడ్డుపై పడిపోయింది. మరోవైపు పట్టణంలోని రాజీవ్ కాలనీలో చెట్లు విరిగి పడ్డాయి. ఈ సంఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పలు చోట్ల విద్యుత్ అంతరాయం ఏర్పడింది. పట్టణంలో అరగంట కురిసిన అకాల వర్ష పట్టణ వాసులను అతలాకుతలం చేసింది.
ఇది కూడా చదవండి….

