భూభారతి చట్టంపై అవగాహన కల్పించాలి
– వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా దృష్టి పెట్టాలి
– అన్ని గ్రామాల్లో ఇందిరమ్మ లబ్దిదారుల ఎంపిక చేపట్టాలి
– అభివృద్ధి పనుల్లో ఎలాంటి జాప్యం తగదు
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
తాండూరు,దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతున్న భూ భారతి చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆదేశించారు.

గురువారం హైదరాబాద్ లోని కోకాపేట్ క్యాంపు కార్యాలయంలో తాండూరు నియోజకవర్గ ఎంపీడీఓలు, మిషన్ భగీరథ, పంచాయతీ శాఖల అధికారులతో పాటు పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేయబోతున్న భూ భారతి చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా పట్టణంలో, గ్రామాల్లో తాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. పంచాయతీ కార్యదర్శులు, అధికారలు ప్రజలకు అందుబాటులో ఉంటూ బోర్లు వేయించడం, పైపులైన్లు మరమ్మత్తులు చేయించడం వంటి పనులు చేపట్టాలన్నారు. ఈ క్రమంలో తాండూరు మండలంలోని జినుగుర్తి గ్రామంలో శ్రీరాముల వారి ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయాలని స్థానిక నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకరావడంతో స్పందిస్తూ ఇరిగేషన్ శాఖల అధికారులతో చర్చించారు.

అదేవిధంగా తాండూరు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులను ఎంపిక చేపట్టాలని, త్వరలోనే అధికారులు, నాయకులు సమన్వయం పాటించి జాబితా పూర్తి చేయాలన్నారు. తాండూరు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయడం నా బాధ్యత అని, తాగునీటి కోసం, అభివృద్ధి పనుల కోసం అధికారులు చిత్త శుద్ధితో పనిచేయాలన్నారు. మున్సిపల్ పరిధిలో ఎసీఎఫ్ పనులు ప్రారంభించాలని పంచాయతీ రాజ్ అధికారులు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, కోట్ పల్లి మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ నారాయణ రెడ్డి, యాలాల పీఏసీఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి….

