వార్డు అభివృద్ధే ధ్యేయం..!
– సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు
– మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తను ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డు అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగడం జరుగుతుందని తాండూరు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు అన్నారు. సోమవారం సాయిపూర్‌లోని 9వ వార్డులో తాత గుడి నుంచి కావేరీ వాటర్ ప్లాంట్ వరకు 14వ ఆర్థిక సంఘం నిధులు రూ. 5లక్షలతో చేపట్టే సీసీ డ్రైన్ పనులకు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు తాండూరు ఆర్డీఓ, ఇంచార్జ్ కమీషనర్ అశోక్ కుమార్‌తో
కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వార్డు సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేసినట్లు చెప్పుకొచ్చారు. వార్డులో నెలకొన్న సమస్యలను దశల వారిగా పరిష్కరిస్తామన్నారు. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని, దశల వారిగా ఒక్కో సమస్యను పరిష్కరించి తీరుతామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ పట్లోల్ల సావిత్రమ్మ, కౌన్సిలర్ మంకల్ రాఘవేందర్, నాయకులు చంటి యాదవ్, సంజీవరావు, ఇంతియాజ్, కాంట్రాక్టర్ బిర్కెట్ రఘు, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
