అభివృద్ధి పనుల్లో పురోగతి పెంచాలి
– పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యం వహించరాదు
– రోడ్ల ఆక్రమణల తొలగింపుపై చర్యలు
– వికారాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ సుధీర్ కుమార్
– తాండూరు మున్సిపల్ సమీక్షా సమావేశం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని అభివృద్ధి పనుల్లో పురోగతిని పెంచేలా చర్యలు తీసుకోవాలని వికారాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్, మున్సిపల్ ప్రత్యేకాధికారి సుధీర్ కుమార్ అన్నారు. మంగళవారం తాండూరు పట్టణాన్ని ఆయన సందర్శించారు. మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి, ఇంజనీరింగ్ అధికారులు మణిపాల్, ఖాజా తదితరులతో కలిసి పట్టణంలో వివిధ దశల్లో ఉన్న అభివృద్ధి పనులను పరిశీలించారు.

అంతకుముందు మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తాండూరు పట్టణంలో 15 ఆర్థిక సంఘం నిధులు, మున్సిపల్ సాధారణ నిధులు, వివిధ గ్రాంట్ల నిధులతో సుమారు 71 అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ఈ పనులను పరిశీలించి పురోగతిని సాధించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగిందన్నారు. కొన్ని పనులు నిధుల విషయంలో టెక్నికల్ సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పనుల వేగవంతంలో కాంట్రాక్టర్లు ఆలస్యం చేయకుండా పూర్తి చేసేలా చూడాలని ఆదేశించడం జరిగిందన్నారు. పట్టణంలోని ప్రధాన రోడ్లపై ఆక్రమణలు తొలగించే విషయంలో చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఎవరైనా ఆక్రమణలు చేసినట్లు అయితే నోటీసులు అందించి తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అదేవిధంగా పట్టణంలో తాగునీరు, పారిశుద్ధ్యం విషయంలో నిర్లక్ష్యం వహించకుండా చూడాలన్నారు. పారిశుద్ధ్య కార్మికుల వేతనాల చెల్లింపులు సక్రమంగా చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ శానిటరి ఇనుస్పెక్టర్ ఉమేష్ కుమార్. టౌన్ ప్లానింగ్ అధికారులు, వార్డు ఆఫీసర్లు తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

