బీహారి కూలీల గంజాయి బిజినెస్‌..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

బీహారి కూలీల గంజాయి బిజినెస్‌..!
– తాండూరులో గుట్టుగా అమ్మకాలు
– ఎక్సైజ్ అధికారుల తనిఖీలతో వెలుగులోకి
– ముగ్గురి అరెస్టు, రిమాండుకు తరలింపు
తాండూరు, దర్శిని ప్రతినిధి : బతుకు దెరువు కోసం వచ్చిన బీహారి కూలీలు గంజాయి విక్రయాలకు పాల్పడుతున్నారు. ఈ సంఘటన తాండూరు పట్టణ పరిధిలో వెలుగులోకి వచ్చింది. శుక్రవారం తాండూరు ఎక్సైజ్ అధికారి శ్రీనివాస్ రెడ్డి ఓ ప్రకటనలో వివరాలను వెల్లడించారు.

బీహారి ప్రాంతానికి చెందిన ముక్తార్ ఆలం(31), నిజాం(55), సద్దాం(28)లు కొన్నేళ్ల క్రితం తాండూరు పట్టణానికి వలస వచ్చారు. పట్టణంలోని జనతా స్టోన్, కేటీసీ స్టోన్ క్రషర్ మిషన్ల పరిసర ప్రాంతాల్లో కూలీలుగా పనిచేస్తున్నారు. అయితే కొన్నాళ్లుగా వీరు గంజాయి విక్రయాలకు పాల్పడుతున్నట్లు తాండూరు ఎక్సైజ్ పోలీసులకు సమాచారం అందింది. జిల్లా ఎక్సైజ్ అధికారి కె.విజయ భాస్కర్ ఆదేశాల మేరకు తాండూరు ఎక్సైజ్ అధికారి శ్రీనివాస్ రెడ్డి తన సిబ్బందితో గురువారం బీహారి కూలీల నివాసాల వద్ద సోదాలు నిర్వహించారు.

ఈ తనిఖీలలో వారి వద్ద నుంచి 500 గ్రాముల ఎండు గంజాయి లభించింది. గంజాయి రవాణా గురించి ఆరా తీయగా బీహార్ నుంచి వచ్చే సమయంలోనే గుర్తు తెలియని వ్యక్తుల వద్ద కొనుగోలు చేసుకుని వచ్చినట్లు తెలిపారు. స్టోన్ మిషన్ల పరిసర ప్రాంతాల్లో గుట్టుగా విక్రయాలకు పాల్పడుతున్నట్లు గుర్తించడం జరిగిందని అధికారులు తెలిపారు. ఈ మేరకు ముగ్గురిని అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు వెల్లడించారు. ఈ సందర్బంగా తాండూరు ఎక్సైజ్ అధికారి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఎవరైనా గంజాయి, మత్తు పదార్థాల విక్రయాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో తాండూరు ఎక్సైజ్ ఎస్ఐలు నిజాముద్దీన్, రవికుమార్, సిబ్బంది భీమయ్య, రవికిషోర్, రమేష్‌, మహేష్‌, సతీష్, కృష్ణ, ఆసిఫా భేగంలు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

శ్రీ గాయత్రిలో ఎన్నికలు…!