వారంలోపు మెడికల్ కాలేజీ సిద్దం..!

ఆరోగ్యం తాండూరు తెలంగాణ రాజకీయం వికారాబాద్

వారంలోపు మెడికల్ కాలేజీ సిద్దం..!
– అన్ని మౌళిక సదుపాయాలు పూర్తి చేయాలి
– రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెకట్రరీ క్రిస్టినా జెడ్ చోగ్దు
– జిల్లా ఆసుపత్రి, ఎంసీహెచ్ ఆసుపత్రిల తనిఖీ
– పరిశుభ్రత పాటించి.. మెరుగైన వైద్యంకు ఆదేశం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో ప్రారంభించబోతున్న కోడంగల్ మెడికల్ కాలేజీలో అన్ని మౌళిక సదుపాయాలు కల్పించి సిద్దంగా ఉంచాలని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జెడ్ చోగ్దు ఆదేశించారు.

బుధవారం తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలో నిర్మిస్తున్న నర్సింగ్ కాలేజీలో ఏర్పాటు చేయబోతున్న కోడంగల్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టీనా జెడ్ చోగ్దు వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తో కలిసి పరిశీలించారు. ఆసుపత్రికి సంబంధించి మ్యాపును పరిశీలించారు. భవనంలో అన్ని గదులను పరిశీలించి ఏర్పాట్లపై ఆరా తీశారు. భవనంలోని గదులకు నెంబర్లు వేయాలని, సీసీ కెమెరాలు, తాగునీటి వసతి, లైట్లు, సెక్యూరీటి రూంలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భవనం ముందు ప్రహారిని, సీసీ రోడ్డును నిర్మించాలన్నారు. ఒక వారంలో అన్ని మౌళిక సదుపాయాలను కల్పించి మెడికల్ కాలేజీని సిద్ధంగా ఉంచాలన్నారు. పనులు త్వరితగతిన చేపట్టాలని సూచించారు. అదేవిధంగా హైదరాబాద్ రోడ్డు మార్గంలోని మైనార్టీ బాయ్స్ హాస్టల్ లో ఏర్పాటు చేస్తున్న వసతి ఏర్పాట్లను కూడా పరిశీలించారు. అనంతరం తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని సందర్శించారు.

ఆసుపత్రిలోని ఐసీయూ, బ్లడ్ బ్యాంకు, ఎమర్జెన్సీ వార్డు, ఐసీటీసీ ల్యాబ్, గొంతు, చెవి. ముక్కు తదితర ఓపీ విభాగాలన్నిటిని పరిశీలించారు. ఆయా విభాగాలలో వైద్యులతో మాట్లాడి సౌకర్యాలు, కొంత వంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఆసుపత్రికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రోగులను పలకరించారు. ఆసుపత్రిలో ఎలాంటి వైద్య సేవలు అందిస్తున్నారని మాట్లాడి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో వైద్యులు రోగులకు అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రతి వార్డును పరిశుభ్రంగా ఉంచుకుని రోగులకు మెరుగైన వైద్యం అందేలా దృష్టిసారించాలన్నారు. మందుల కొరత లేకుండా చూసుకోవాలన్నారు. అనంతరం హైదరాబాద్ రోడ్డు మార్గంలోని మాతా శిశు ఆసుపత్రి(ఎంసీహెచ్)ను కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టీనా జెడ్ చోగ్దు తనిఖీ చేశారు.
kvcs
ఆసుపత్రిలో గర్భిణీలకు, బాలింతలకు అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో రికార్డు నిర్వహణ, మందులు గురించి ఆరా తీశారు. ఆసుపత్రికి ఎంతమంది గర్భిణీలు వస్తున్నారు. ప్రసవాల వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహించరాదని, అందరికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, అసిస్టెంట్ కలెక్టర్ హర్ష్ చౌదరి, కోడంగల్ ప్రత్యేకాధికారి వెంకట్ రెడ్డి, జీజీహెచ్ డా. మాలతీ. సూపరిండెంట్ డా. సునీత, తహసీల్దార్ తారాసింగ్, ఆర్ఎంఓ డా. ఆనంద్ గోపాల్ రెడ్డి, మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి, మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ రాజు, వైస్ ప్రిన్సిపల్ డా. పద్మ, కాంట్రాక్టర్ చంద్రశేఖర్, ఈఈ ఉమేష్, అధికారులు, వైద్యులు, సిబ్బంది ఉన్నారు.

ఇదికూడా చదవండి..

బీసీ బిల్లు కోసం ఢిల్లీకి వెళ్తాం..!