బీసీ బిల్లు కోసం ఢిల్లీకి వెళ్తాం..!
– హస్తం బిల్లుకు బీజేపీ క్లియర్స్ ఇచ్చి తీరాలి
– బలహీన వర్గాలకు అన్యాయం చేయొద్దు
– కేంద్రానికి తెలంగాణ డిప్యూటీ సీఎం విజ్ఞప్తి
– తాండూరులో జరిగిన సభలో భట్టి విక్రమార్క
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఇచ్చిన హామి మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదించిన 42శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లు పాస్ కోసం ఢీల్లికి వెళ్లేందుకు సిద్దంగా ఉన్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరై ఐటీ శాఖ మంత్రి, ఉమ్మడి జిల్లా ఇంచార్జ్ మంత్రి శ్రీధర్ బాబు, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డిలతో కలిసి శంకుస్థాపనలు చేశారు.

అనంతరం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలోని జీపీఆర్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో కొత్తగా మంజూరైన రేషన్ కార్డులను లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీ వాగ్దానం మేరకు, తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు రాజకీయ, ఉద్యోగ రంగాలలో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఇచ్చిన హామిని గుర్తుచేశారు. ఇచ్చిన హామి మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో శాసనసభలో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల బిల్లును ఆమోదించడం జరిగిందన్నారు. ఈ బిల్లుకు కేంద్రం నుంచి క్లియరెన్స్ తెచ్చుకునేందుకు రాష్ట్ర గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపించడం జరిగిందన్నారు.

రాష్ట్రంలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వం పాస్ చేసిన బిల్లు సరైందని భావించి కేంద్రం క్లియర్స్ ఇవ్వాలన్నారు. తెలంగాణలోని బడుగు బలహీన వర్గాలపై ఏమాత్రం చిత్తశుద్ది ఉంటే బిల్లును పాస్ చేయాలన్నారు. బిల్లును తోసిపుచ్చి.. అన్యాయం చేయాలని చూడవద్దని కోరారు. కోర్టు ఆదేశాల మేరకు సెప్లంబర్ 30 తేదిలోపు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సర్కారు సిద్దంగా ఉందన్నారు. బీసీల రిజర్వేషన్ పై కేంద్రం క్లియర్ ఇవ్వాలని కోరేందుకు సీఎం రేవంత్ నాయకత్వంలో మంత్రి వర్గ సభ్యులు, పార్లమెంట్ సభ్యులంతా కలిసి ఢిల్లీకి వెళ్లేందుకు సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు. నాలుగైదు రోజుల్లో అందరం ఢిల్లీకి వెళ్లుందుకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. కేంద్రం నుంచి క్లియర్స్ వస్తే రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను స్థానిక సంస్థలతో పాటు ఉద్యోగ వ్యవస్థలో కూడా అమలు చేస్తామన్నారు.

ఇదికూడా చదవండి..

