వీధి వ్యాపారులకు శుభవార్త..
– పీఎం స్వనిధితో సులభంగా రుణాలు
దర్శిని బ్యూరో: నిరుపేదలకు, చిరు వ్యాపారుల కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకానలు ప్రవేశ పెట్టింది. అందులో పీఎం స్వనిధి పథకం ఒకటి. 2020 జూన్ 1న కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా వ్యాపారులకు రుణాలతో పాటు వ్యాపారులు, వీధి వ్యాపారులు తమతమ వ్యాపారాన్ని మరింతగా పెంచుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు అవకాశం కల్పిస్తోంది. అర్హులైన వారికి ఈ స్కీమ్ కింద దరఖాస్తు చేసుకుంటే రూ.10 వేలు అందించగా, ప్రస్తుతం రూ.20 వేల వరకు పెంచారు. అయితే తీసుకున్న రుణాన్ని విధించిన గడువులోగా సరిగ్గా చెల్లించినట్లయితే వడ్డీ రాయితీ పొందే వెసులుబాటు కూడ ఉంది. కేంద్ర సర్కార్ వడ్డీ రేటులో 7 శాతం వరకు సబ్సిడీ అందిస్తుంది. తీసుకున్న రుణాన్ని విధించిన గడువులోగా చెల్లిస్తే మళ్లీ రుణం తీసుకోవచ్చు. రుణం కావాలనుకునే వారు పీఎం స్వనిధి వెబ్‌సైట్‌కు వెళ్లి రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకంలో చేరేందుకు 2022, మార్చి 31 వరకు గడువును ప్రకటించారు.
ఎవరెవరు అర్హులు:
ఈ పథకం కింద రుణం పొందే వీధి వ్యాపారులు.. 2020 మార్చి 24 లేదా అంతకు ముందు ఎలాంటి రుణాలు కూడా పెండింగ్ ఉండకూడదు. అలాంటి వారు ఈ పథకంలో రుణం పొందేందుకు అర్హులు
ఎలా దరఖాస్తు చేసుకోవాలి:
ఈ పీఎం స్వనిధి పథకం అర్హులైన వీధి వ్యాపారులు రుణం పొందవచ్చు. వెబ్‌సైట్ pmsvanidhi.mohua.gov.in ద్వారా లోన్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు
లాభాలు:
పీఎం స్వనిధి పథకం కింద వీధి వ్యాపారులు రూ.20,000 వరకు వర్కింగ్ క్యాపిటల్ లోన్ పొందుతారు. తీసుకున్న రుణం సకాలంలో చెల్లించినట్లయితే మరో రుణం పొందేందుకు అర్హులు అవుతారు.
వడ్డీ రేట్లు:
ఈ పథకంలో రుణం తీసుకున్న రుణదాతలకు వడ్డీ రేట్లు మారుతుంటాయి. బ్యాంకులలో ఉండే వడ్డీ రేట్లు ఈ స్కీమ్‌లో కూడా అలాగే ఉంటాయి.
రుణ చెల్లింపు కాలం:
ఈ పీఎం స్వనిధి కింద రుణం తీసుకున్న వారు ఏడాది పాటు ఈఎంఐ పద్దతుల్లో చెల్లించవచ్చు. ముందస్తు చెల్లింపు ఛార్జీలు ఏమి ఉండవు.
వడ్డీ రాయితీ:
పీఎం స్వనిధి కింద రుణం పొందిన వారికి 7 శాతం వడ్డీ రాయితీ లభిస్తుంది. త్రైమాసికానికి వడ్డీ రాయితీ మొత్తం రుణగ్రహీత ఖాతాలో జమ చేయబడుతుంది

