కాంగ్రెస్‌లో ‘క్రాస్’ ఎటువైపో..!

తాండూరు రాజకీయం వికారాబాద్

కాంగ్రెస్‌లో ‘క్రాస్’ ఎటువైపో..!
– అధికార పార్టీ తరుపు అభ్యర్థులలో టెన్షన్‌
– ఈ ఎన్నికల్లో వారి గెలుపు ఓటములు అసక్తికరం
– తాండూరు నియోజకవర్గంలో ఇదీ పరిస్థితి
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లాలో పంచాయతి ఎన్నికలు హోరా హోరీగా జరుగుతున్నాయి. గెలుపు, ఓటములపై ఆయా పార్టీల మద్దతు దారులు ధీమాగా ఉన్నారు. పార్టీ తరుపునుంచి ఒకే అభ్యర్థి ఉంటే ఎలాంటి టెన్షన్ లేదు, కాని తాండూరు నియోజకవర్గంలోని అధికార పార్టీలో రెబల్‌ అభ్యర్థుల గుబులు పట్టుకుంది. ఈ ఎన్నికల్లో పక్కా క్రాస్ ఓటింగ్ జరిగే ప్రమాదం ఉందని అభిప్రాయ పడుతున్నారు.

తాండూరు మండలంలో 33, బషీరాబాద్ మండలంలో 39, యాలాల మండలంలో 39, పెద్దేముల్ మండలంలో 38 పంచాయతీలలో గాను సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో తాండూరు మండలం, చిట్టిగణాపూర్, రాంపూర్ మీది తాండా, మేజర్ పంచాయతీ కరణ్ కోట్, వీరారెడ్డిపల్లి, బిజ్వార్ ఏకగ్రీవం అయ్యాయి.

యాలాల మండలంలో లక్ష్మీనారాయణపూర్, కిష్టాపూర్, సంగాయిగుట్ట తాండా, సంగెంకుర్దు, గంగాసాగర్, దేవుల తాండా, జక్కెపి, పేర్కంపల్లి తాండా, బండమీదిపల్లి, రేళ్లగడ్డ తాండా, సంగాయిపల్లి తాండాలు ఏకగ్రీవంగా నిలిచాయి. పెద్దేముల్ మండలంలో రుద్రారం, చైతన్య నగర్, దుగ్గాపూర్, సిద్దన్నమడుగు తాండాలు ఏక్రగీవం కానున్నాయి. బషీరాబాద్ మండలంలో మంతన్ గౌడ్, బాబునాయక్ తాండా, హంక్యానాయక్ తాండా, బాడ్లాపూర్ లు సర్పంచులు ఏకగ్రీవం అయ్యాయి.

బరిలో రెబల్స్
తాండూరు నియోజకవరంలోని అధికార పార్టీ కాంగ్రెస్‌లో రెబల్‌ అభ్యర్థులు బరిలో ఉండడం చర్చనీయాంశంగా మారింది. పోటిలో ఉన్న అభ్యర్థులు కండువాలు కప్పుకుని ప్రచారం చేయడం అసక్తికరంగా మారింది.

బషీరాబాద్ మండలకేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతలు గ్రామ సర్పంచ్ స్థానం బరిలో ఉండడం చర్చనీయాంశంగా మారింది. యాలాల మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. గ్రామానికి చెందిన ఇద్దరు కాంగ్రెస్ నేతలు తమ వారిని పోటీలో ఉంచారు. పెద్దేముల్ మండలం మంబాపూర్ గ్రామ పంచాయతీలో కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. ఇద్దరు కాంగ్రెస్ నేతలు అభ్యర్థులను నిలబెట్టడం ఆసక్తిగా మారింది. తాండూరు మండల పరిధిలోని ఖాంజాపూర్ గ్రామంలో కూడా ఇద్దరు అభ్యర్థులు కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేస్తుండడం గందరగోళంగా మారింది.

విజయాలు తారుమారు తప్పదా..?
పంచాయతీ ఎన్నికలకు గురువారం పోలింగ్ జరగనుంది. ఓటింగ్‌ కోసం అధికారులు సర్వం సిద్దం చేశారు. పోలింగ్ సమమం దగ్గరపడుతుండడంతో అధికార పార్టీ తరుపు అభ్యర్థులలో క్రాస్ ఓటింగ్ భయం అంటుకుంది. ఒకే పార్టీకి చెందిన అభ్యర్థులు తమకు ఓటేస్తారో.. లేదో ప్రత్యర్థికి ఓటు వేస్తారో అని ఆందోళనకు గురవుతున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు కోవర్టలు కూడా ఉండొచ్చని భయపడుతున్నారు. రేపు జరిగే పోలింగ్, కౌంటింగ్ తరువాత విజయాలు తారు మారు కాక తప్పదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎవరు గెలుస్తారో.. ఎవరు ఓటమిని చవిచూస్తారో రేపటి వరకు వేచిచూడాల్సిందే.

ఇదికూడా చదవండి…

వామ్మో.. వీళ్లేం.. ఎర్రోళ్లు కాదు..!