చ‌లాన్ల చిచ్చులో భ‌గ్గుమ‌న్న బైకు

క్రైం తెలంగాణ హైదరాబాద్

చ‌లాన్ల చిచ్చులో భ‌గ్గుమ‌న్న బైకు
– న‌డిరోడ్డుపై కాల్చేసిన వాహ‌న‌దారుడు
– ఆదిలాబాద్ టౌన్‌లో ఘ‌ట‌న
హైద‌రాబాద్‌, ద‌ర్శిని ప్ర‌తినిధి: ట్రాఫిక్ రూల్స్ నిబంధ‌న‌ల ఉల్లంఘ‌ల‌న పేరుతో పోలీసులు విధించే చ‌లాన్ల భారం మోయ‌లేక ఓ వాహ‌న‌దారుడికి చిర్రెత్తుకొచ్చంది. ఓవైపు పెట్రోల్ ధ‌ర‌లు పెర‌గడం.. మ‌రోవైపు బైకుపై చ‌లాన్ల మోత‌తో
నాకొద్దు ఈ బైకు అంటూ న‌డిరోడ్డుపైనే దానిని త‌గుల‌బెట్టాడు. తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ టౌన్‌లో జ‌రిగిన ఈ సంఘ‌ట‌న చ‌ర్చ‌నీయాంశ‌మైంది. వివ‌రాల్లోకి వెళితే… ఆదిలాబాద్ టౌన్‌లోని ఖానాపూర్‌కు చెందిన మక్బూల్‌ అంబేద్క‌ర్ స‌ర్కిల్ సమీపంలోబైక్‌పై వెళ్తుండగా.. ట్రాఫిక్‌ పోలీసులు ఫొటో తీసి ఈ-చలాన్ కింద జరిమానా వేశారు. దీంతో అసహనానికి గురైన వాహనదారుడు తరచూ ట్రాఫిక్ పోలీసులు ఇలా ఫోటోలు తీసి ఈ- చలాన్లు వేస్తున్నారని, నడిరోడ్డుపైనే తన బైక్‌కు నిప్పు పెట్టాడు. దీంతో రోడ్డుపై ఉన్నవారంతా విస్తుపోయారు. వెంటనే అక్కడున్నవారు, పోలీసులు వచ్చి మంటలను ఆర్పేశారు. అయినా అప్పటికే బైక్ డ్యామేజ్ అయ్యింది. చలానాల భారం భరించలేక పంజాబ్ చౌక్ లో తన వాహనాన్ని తగలబెట్టినట్లు వెల్లడించాడు. మొత్తానికి చ‌లాన్ల చిచ్చులో బంగారంలాంటి బైకు బుగ్గిపాల‌య్యింద‌ని స్థానికులు అయోమయం వ్య‌క్తం చేశారు.

వాహ‌న‌దారుడితో పాటు మ‌రోక‌రిపై కేసు
మ‌రోవైపు బైకుకు నిప్పంటించిన ఘ‌ట‌న‌లో వాహ‌దారుడితో పాటు మ‌రో వ్య‌క్తిపై పోలీసులు కేసు న‌మోదు చేశారు. అంత‌కుముందు పంజాబ్ చౌక్ వద్ద ట్రాఫిక్ ఎస్ఐ షేక్ అబ్దుల్ బాకి ఆధ్వర్యంలో సిబ్బంది వాహనాల తనిఖీలు చేపడుతున్నారు. ఈ క్ర‌మంలో శాంతి నగర్ కు చెందిన షేక్ ఫరీద్ ద్విచక్ర వాహనంపై వస్తుండగా తనిఖీల నిమిత్తం నిలిపివేసి బైకుకు వెనుక సైడ్ నంబర్ లేకుండా ఉండ‌డం, వాహనానికి సంబంధించిన నిజ ధ్రువపత్రాలు లేకపోవ‌డం, యజమాని పేరు తప్పుగా తెలిపడంతో పాటు జరిమానాలు పెండింగ్ ఉండడం గుర్తించి బైక్‌ను అడ్డుకున్నారు. ఈ విష‌యాన్ని ఫ‌రీద్ త‌న మిత్రుడైన షేక్ మ‌క్బూల్‌కు స‌మాచారం అందించాడు. అక్క‌డి చేరుకున్న త‌రువాత ఇరువురు ట్రాఫిక్ పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. విధులకు సైతం ఆటంక పరిచారు. దీంతో వారిపై ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ లో ట్రాఫిక్ ఎస్సై ఫిర్యాదు చేయ‌గా కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై జి అప్పారావు పేర్కొన్నారు.