తాండూరు ఎమ్మెల్యేకు దమ్ములేదు..!
– చైర్మన్, కౌన్సిలర్లను ప్రకటించడం చేతకాదా
– బీఆర్ఎస్‌కు ఉన్న ఆదరణను ఓర్వలేక దౌర్జన్యాలు
– అరాచకాలకు పాల్పడితే ఊరుకునేది లేదు
-తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శని ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ దద్దమ్మ పాలన చేస్తోందని, తాండూరు ఎమ్మెల్యేకు దమ్ము లేదని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ధ్వజమెత్తారు. గురువారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నామినేషన్ల దాఖలలో రోహిత్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామిలను, గ్యారెంటీలను నెరవేర్చకుండా మోసం చేస్తుందని అన్నారు. రైతులు, మహిళలు, యువకులను మభ్యపెడుతూ దద్దమ్మ పాలన చేస్తోందని విమర్శించారు. తాండూరు మున్సిపల్ ఎన్నికల్లో ఎమ్మెల్యే దమ్ములేని రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. చైర్మన్, కౌన్సిలర్ల అభ్యర్థులను ప్రకటించడం చేతకావడం లేదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీకి ఉన్న ఆదరణను చూసే కాంగ్రెస్ పార్టీకి భయం పట్టుకుందని అన్నారు. పార్టీలో గెలిచే అభ్యర్థులు లేక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు, నేతలపై దౌర్జన్యాలకు, బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

దమ్ముంటే చైర్మన్, కౌన్సిలర్లను ప్రకటించి రంగంలోకి దిగాలని సవాల్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎన్నడు లేని విధంగా అభివృద్ధి చేసిందని, తాండూరులో బీఆర్ఎస్ వైపు ప్రజలు మద్దతు తెలుపుతున్నారని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో 36 వార్డుల్లో 30 స్థానాలను గెలిపించుకుంటామని, పట్లోళ్ల నర్సింలును చైర్మన్ గా నిలబెడతామని అన్నారు. ప్రజలు, కార్యకర్తలు బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్ శ్రీశైల్ రెడ్డి, జిల్లా మాజీ లైబ్రరీ చైర్మన్ రాజుగౌడ్, శ్రీనివాస్ చారి, మాజీ కౌన్సిలర్లు వరాల శ్రీనివాస్ రెడ్డి, సంగీత ఠాకూర్, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

