మెనిఫెస్టో నిండా.. సంక్షేమమే..!
– తాండూరు ప్రజా పాలనకే పెద్దపీట
– పట్టణంలో అన్నపూర్ణ క్యాంటీన్లు
– ప్రతి వార్డులో మినరల్ వాటర్ ప్లాంట్లు
– అభివృద్దే బీఆర్ఎస్ లక్ష్యమన్న పైలెట్
– అదిరిపోయిన బీఆర్ఎస్ పార్టీ మెనిఫెస్టో
తాండూరు, దర్శిని ప్రతినిధి : అభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ బీఆర్ఎస్ మెనిఫెస్టోను ప్రకటించారు. తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పార్టీ నేతలతో కలిసి మెనిఫెస్టోను విడుదలు చేశారు.

గురువారం తాండూరు పట్టణంలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. తాండూరును అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే బీఆర్ఎస్ లక్ష్యమని అన్నారు. ఎన్నికల్లో గెలిపిస్తే మున్సిపల్లోని అన్ని వార్డుల్లో రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి వ్యవస్థల రూపు మారుస్తామని అన్నారు. పట్టణంలో చైర్మన్, కౌన్సిలర్ల పాలనను ప్రజలకు దగ్గర చేస్తామని అన్నారు. ప్రతి వార్డులో చైర్మన్, కౌన్సిలర్లు మార్నింగ్ వాక్ కార్యక్రమం చేపడుతారని తెలిపారు. ప్రతినెల కౌన్సిల్ సమావేశాలు, ఆరు నెలలకు ఒకసారి పాలనపై నివేధికలు వెల్లడించేలా చూస్తామన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు వార్డు కమిటీలతో పాటు అధికారులు ఇంటి వద్దకే వచ్చేలా ప్రణాళికలు చేపడుతామని అన్నారు.

ప్రతి సోమవారం మున్సిపల్ చైర్మన్ ఆధ్వర్యంలో ప్రజాదర్బార్ నిర్వహిస్తామని వెల్లడించారు. ప్రతి వార్డులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతామని అన్నారు. ప్రతి వార్డులో మినరల్ వాటర్ ప్లాంటులు ఏర్పాటు చేసి రూ. 5లకు 20లీటర్ల తాగునీరును పంపిణీ చేస్తామని అన్నారు. మున్సిపల్ ఆధ్వర్యంలో అన్నపూర్ణ క్యాంటీన్లు ఏర్పాటు చేసి రూ. 10లకే భోజనం అందిస్తామని అన్నారు. పోలీసు శాఖ సమన్వయంతో ట్రాఫిక్ నియంత్రణ. ట్రాఫిక్ సిగ్నళ్ల ఏర్పాటు చేస్తామని అన్నారు. ముఖ్యంగా ప్రజలను వేధిస్తున్న వీధి కుక్కుల బెడద నుంచి విముక్తి కల్పిస్తామన్నారు. ఆశపెట్టి.. ఆకాశానికి నిచ్చెన వేయకుండా మెనిఫెస్టోలో ఉన్న అన్నింటిని గ్యారెంటీగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్ శ్రీశైల్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్, చైర్మన్ అభ్యర్థి పట్లోళ్ల నర్సింలు, సీనియర్ నాయకులు డా. సంపత్ కుమార్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

