విజయోత్సవ ర్యాలీలు నిషేధం..!
– జిల్లాలో పోలీస్ యాక్ట్ 30 అమలు
– డీజేలు, సౌండ్ సిస్టమ్ పెట్టిని కేసులు
– వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా
– తాండూరులో కౌంటింగ్ కేంద్రాల పరిశీలన
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల విజయోత్సవ ర్యాలీలపై నిషేధంను విధించడం జరిగిందని జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా తెలిపారు. శుక్రవారం మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించారు.

జిల్లా పరిధిలోని వికారాబాద్, పరిగి, కోడంగల్ మరియు తాండూర్ పట్టణాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాలను స్వయంగా సందర్శించి, క్షేత్రస్థాయిలో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన బందోబస్తు విధుల్లో ఉన్న పోలీస్ అధికారులు, సిబ్బందికి కీలక సూచనలు చేశారు.

కౌంటింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో సీఆర్పీసీ 144 సెక్షన్ అమలులో ఉంటుందని, గుంపులుగా చేరడం, నినాదాలు చేయడం, బైక్ ర్యాలీలు నిర్వహించడం వంటి చర్యలు పూర్తిగా నిషేధం అని స్పష్టం చేశారు. అలాగే జిల్లాలోని అన్ని మునిసిపల్ ప్రాంతాలలో కూడా విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడంపై కఠిన నిషేధం ఉంటుందని తెలిపారు. జిల్లాలో పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉన్నందున అనుమతులు లేకుండా విజయోత్సవ ర్యాలీలు, డీజేలు, సౌండ్ సిస్టమ్స్ వినియోగానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఉండదని పేర్కొన్నారు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మరోవైపు సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు, అసత్య ప్రచారాలను నమ్మవద్దని, అలాంటి సమాచారాన్ని షేర్ చేసే వారిపై కూడా చర్యలు తప్పవని ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రజలంతా పోలీస్ శాఖకు సహకరించి, శాంతిభద్రతలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య, పట్టణ సీఐ సంతోష్ కుమార్, సిబ్బంది తదితరులు ఉన్నారు.


