ప్రయాణికులకు ఆర్టీసీ షాక్..
– మరోసారి చార్జీలు పెంపుకు చర్యలు
– రేపు సీఎం సమావేశం తరువాత నిర్ణయం
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: సురక్షితంగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ వారికి షాక్ ఇవ్వబోతోంది. మరోసారి ప్రయాణ చార్జీలను పెంచేందుకు సిద్దమవుతోంది. ఆర్టీసీ అప్పులు.. కరోనా పరిస్థితుల నేపథ్యంలో నష్టాల్లో కూరుకుపోయిన ప్రజారవాణా సంస్థకు ఇటీవల డీజిల్ రూపంలో మరో పెనుభారం పడింది.
రోజురోజుకీ పెరిగిపోతున్న డీజిల్ ధరలతో ఆర్టీసీ రోజూ కోట్లలో నష్టం చవిచూస్తోంది. దీంతో చార్జీలు పెంచక తప్పని అనివార్య పరిస్థితులు నెలకొన్నట్లు స్పష్టమవుతోంది. మంగళవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఆర్టీసీ ఛార్జీల పెంపుపై కీలక వ్యాఖ్యలు చేశారు. చార్జీల పెంపుపై రేపు మరోసారి సీఎం కేసీఆర్‌తో భేటీ ఉందని.. ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు బాజిరెడ్డి గోవర్ధరన్ పేర్కొన్నారు. ఈ భేటీలో సీఎం కేసీఆర్ ఛార్జీలపై నిర్ణయం తీసుకుంటారని ఆయన తెలిపారు. తెలంగాణలో ఆర్టీసీలో ఛార్జీలు పెంచినా.. పక్క రాష్ట్రాలతో పోల్చితే తక్కువగానే ఉంటుందని ఆయన స్పష్టంచేశారు. దీంతోపాటు రాష్ట్రంలో బస్ డిపోలను ఎత్తివేస్తున్నారన్న వార్తలను గోవర్ధన్ ఖండించారు. అవన్నీ తప్పుడు వార్తలను.. ఉద్యోగుల అవసరాన్ని బట్టి పలు డిపోలకు అడ్జెస్ట్ చేస్తున్నట్లు తెలిపారు.
చార్జీల పెంపు నిర్ణయం కొలిక్కి వస్తే కిలోమీటరుకు 15 పైసల నుంచి 30 పైసలు పెంచాలనే ఆలోచన చేస్తోంది తెలంగాణ ఆర్టీసీ. పెరిగిన డీజిల్ భారం నుంచి బయట పడాలంటే చార్జీలు స్వల్పం పెంచాలని భావిస్తోంది ఆర్టీసీ యాజమాన్యం. చార్జీల పెంపు ద్వారా ప్రయాణికులపై వెయ్యి కోట్ల వరకు భారం పడే అవకాశం ఉందని తెలుస్తోంది.

