భువన్ సర్వేను త్వరగా పూర్తి చేయాలి
– వికారాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య
– తాండూరులో అభివృద్ధి పనులపై ఆరా
తాండూరు, దర్శిని ప్రతినిధి : భవనాల సమగ్ర సమాచారాన్ని ఆన్‌లైన్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న భువన్ సర్వే త్వరగా పూర్తి చేయాలని వికారాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య అన్నారు. మంగళవారం తాండూరు పట్టణాన్ని ఆయన సందర్శించారు. తాండూరు ఆర్డీఓ, మున్సిపల్ ఇంచార్జ్ కమీషనర్ అశోక్ కుమార్‌తో కలిసి పాత తాండూరు, సాయిపూర్ తదితర ప్రాంతాల్లో సీసీ రోడ్లు, మురుగు కాలువ నిర్మాణాలు, ఇతర అభివృద్ధి పనులను పరిశీలించారు. పాత తాండూరులో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. అదేవిధంగా పట్టణంలోని సీతారంపేట్‌లో మున్సిపల్ భువన్ సర్వేను సమీక్షించారు. సర్వే ఏవిధంగా కొనసాగుతుంది..? ఎంత శాతం పూర్తయ్యింది..? ఇంకా ఎంత మిగిలి ఉంది..? అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. సర్వేలో నివాస భవనాలు, కమర్షియల్ భవనాల వివరాలను పక్కాగ నమోదు చేయాలన్నారు. భువన్ సర్వేను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ బుచ్చిబాబు, జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, వర్క్ ఇన్స్పెక్టర్ మహేష్ తదితరులు ఉన్నారు.
