ఒంటిపూట బడుల తేది ఖరారు..!
– వేసవి సెలవులపై విద్యాశాఖ ప్రకటన
– ఉర్దూ మీడియం స్కూళ్లు, కాలేజీలలో టైమింగ్ మార్పు
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో ఒంటిపూట బడుల నిర్వహణపై విద్యాశాఖ నిర్ణయానికి వచ్చింది. వేసవిలో పెరుగుతున్న ఎండలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్ల పిల్లలకు ఒంటి పూట బడులు అమలుకు చర్యలు తీసుకుంది.

దీంతో పాటు వేసవి సెలవులపై స్పష్టత ఇచ్చింది. వచ్చేనెల మార్చి 16వ తేదీ నుంచి ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఒంటిపూట బడులు ప్రారంభించనున్నట్లు ప్రకటన వెలువరించింది. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థలకు వేసవి సెలవులు ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చేసింది. మరోవైపు పదో తరగతి పరీక్ష కేంద్రాలున్న సెంటర్లలో ఉదయం పరీక్షలు జరుగుతాయి. కావున ఈ స్కూళ్లలో మాత్రం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నడుపుతారు.

మరోవైపు రంజాన్ నేపథ్యంలో ఉర్దూ మీడియం బడులు, డైట్ కాలేజీలకు ఫిబ్రవరి 19 నుంచి మార్చి 20 వరకు ఒంటిపూట బడులు నిర్వహించేలా ప్రత్యేక మార్పులు చేశారు. ఉపవాసంలో ఉన్న విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయా స్కూళ్లలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు తరగతులు నడపాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ పేర్కొన్నారు. అవసరమైతే వారంలో ఒక రోజు అదనపు తరగతులు పెట్టాలని సూచించారు.


