ఇంటర్‌ పరీక్షలకు పక్కా ఏర్పాట్లు ..!

తాండూరు రాజకీయం వికారాబాద్

రేపటి నుంచే ఇంటర్‌ పరీక్షలు
– తాండూరులో 7 కేంద్రాల ఏర్పాటు
– అరగంట ముందే హాల్‌లోకి అనుమతి
– 5నిమిషాలు దాటితే నో ఎంట్రీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లాలో ఇంటర్ పరీక్షలకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. బుధవారం నుంచి పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. ఇంటర్ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని తాండూరులో 7 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.

తాండూరు పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2, సింధు బాలికల జూనియర్ కళాశాల-1, సిద్ధార్థ జూనియర్ కళాశాల-1, భాష్యం జూనియర్ కళాశాలతో పాటు హైదరాబాద్ రోడ్డు మార్గంలోని టీఎంఆర్జేజేపీ, సోషల్ వెల్పేర్‌ కాలేజీ, కళాశాలలో మొత్తం 7 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈసారి మొదటి సంవత్సరంలో 1825 మంది విద్యార్థులు, రెండో సంవత్సరంలో 1650 మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నట్లు తాండూరు కస్టోడియన్లు మల్లినాథప్ప, ఆర్.కృష్ణయ్యలు తెలిపారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు అరగంట ముందుగానే చేరుకోవాలని సూచించారు. నిర్ణీత సమయం కంటే 5 నిమిషాలు ఆలస్యంగా వస్తే పరీక్ష నో ఎంట్రి నిబంధన వర్తిస్తుందని, విద్యార్థులను పరీక్షలకు అనుమతించడం జరిగదని హెచ్చరించారు.

హాల్ టిక్కెట్‌లపై క్యూఆర్ కోడ్
ఇంటర్ పరీక్షల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదరవకుండా అధికారులు చర్యలు చేపట్టారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు నేరుగా చేరుకునే విధంగా హాల్‌ టిక్కెట్‌లపై క్యూఆర్‌ కోడ్‌ ముద్రించారు. కోడ్‌ స్కాన్‌ చేస్తే పరీక్షా కేంద్రానికి సంబంధించిన లోకేషన్ కనిపిస్తుంది. దీంతో నేరుగా విద్యార్థులు పరీక్షా కేంద్రానికి చేరుకోవచ్చు. అదేవిధంగా పరీక్షా కేంద్రాల వద్ద అధికారులు సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్దకు పర్యవేక్షణ అధికారులు, ఇన్విజిలేటర్స్, ఇతర సిబ్బంది ఎవ్వరికీ కూడా సెల్ ఫోన్ అనుమతి లేదని నిషేధం విధించారు. మరోవైపు విద్యార్థులు మాల్ ప్రాక్టీసుకు పాల్పడితే డిబార్ చేయడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ఇందులో ఎవరైనా అధికారులు కూడా భాగస్వాములుగా తేలితే వారిపై కూడా చర్యలు తప్పవంటున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, జిరాక్స్ కేంద్రాలను మూసివేయాలనే ఉత్తర్వులు ఉన్నాయని తెలిపారు. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు.

కుల దురహంకార ఘటనలు మళ్లీ జరగొద్దు..!