నన్ను చంపాలని చూస్తున్నారు..!
– బీఆర్ఎస్, ఎంఐఎం నేతల నుంచి ప్రాణహాని
– బషీర్‌మీయా తాండా మాజీ సర్పంచ్ మిత్రునాయక్
– రక్షణ కల్పించాలని పోలీసులకు ఫిర్యాదు
తాండూరు, దర్శిని ప్రతినిధి : నన్ను చంపాలని కుట్రలు చేస్తున్నారని యాలాల మండలం బషీర్‌మీయా తాండా మాజీ సర్పంచ్ మిత్రునాయక్ అన్నారు.

శనివారం యాలాల పోలీసులకు ఆయన తనకు బీఆర్ఎస్ పార్టీ నేతలు, ఎంఐఎం నేత నుంచి రక్షణ కల్పించాలని ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగా మిత్రునాయక్ మాట్లాడుతూ తాండూరు పట్టణంలో నిర్మిస్తున్న చిలుక నిర్మాణంలో ఏర్పడ్డ కబ్జాలపై ఆరోపణలు చేయడం జరిగిందని తెలిపారు. ఈ విషయంలో ఎంఐఎం నేత హాదిపై ఫిర్యాదు చేయడం జరిగిందని వివరించారు.

అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన డా.సంపత్ కుమార్, పట్లోళ్ల నర్సింలు దౌర్జన్యాలకు పాల్పడ్డారని ఆధారాలతో ప్రజల దృష్టికి తెచ్చినట్లు చెప్పుకొచ్చారు. ఈ కారణంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు, ఎంఐఎం నేత తనను చంపాలని చూస్తున్నారని పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. వారి నుంచి తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని పోలీసులకు ఫిర్యాదు ద్వారా కోరారు. తనకు జరగరానిది జరిగితే వారిదే బాధ్యత అని అన్నారు.


