కార్మికుల నిరాహార దీక్ష
– సమ్మెను ఉదృతం చేసిన కార్మికులు
– డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం
తాండూరు, దర్శిని ప్రతినిధి: పెంచిన వేతనాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తాండూరు మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులు చేపట్టిన సమ్మె ఉద్భతంగా మారింది. డిమాండ్లు నెరవేర్చే వరకు వెనక్కి తగ్గేది లేదంటూ భీష్మించారు. శుక్రవారం 15వ రోజుకు చేరిన సమ్మెలో కార్మికులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అధికారులు, పాలకులు దిగివచ్చేంత వరకు నిరాహార దీక్ష చేయాలని బైటాయించారు. ఇందులో భాగంగా శుక్రవారం కార్మికులలో ముందుగా ఒకరు నిరాహార దీక్షను చేపట్టారు. తరువాత మరికొందరు బైటాయించాలని కూడ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచే పారిశుద్ధ్య కార్మికులపై అధికారులు, పాలకులు వివక్ష చూపించడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వం పెంచిన జీతాలనే అమలు చేయాలని కోరుతున్నామని, ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ కార్మికులతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. పెంచిన వేతనాలు, పీఆర్సీని అమలు చేసే వరకు సమ్మెను ఉదృతం చేస్తామని, ప్రాణాల మీదకు వచ్చినా నిరాహార దీక్షను కొనసాగిస్తామని: హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఏఐటీయూసీ యూనియన్ నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

