పాహీమాం.. జ్యోతిర్లింగేశ్వరా..!
– వెయ్యేండ్ల సోమనాథ లింగాల దర్శనం
– మహిమలను వీక్షించిన తాండూరు భక్తజనం
– దర్శించుకున్న బీఎస్ఆర్ దంపతులు
– పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్, ప్రముఖులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : పాహీమాం జ్యోతిర్లింగేశ్వరా అంటూ తాండూరు భక్తులు సోమనాథ జ్యోతిర్లింగాలను దర్శించుకున్నారు.

మంగళవారం తాండూరు పట్టణం వినాయక ఫంక్షన్ హాల్‌లో ఆర్ట్ ఆఫ్ లింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమనాథ జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం కల్పించారు. వెయ్యి సంవత్సరాల ప్రాచీన ప్రసిద్ది కలిగిన సోమనాథ జ్యోతిర్లింగ దర్శనం కోసం తాండూరు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఋషి దేవ వ్రతజీ ఆధ్వర్యంలో జ్యోతిర్లింగాలకు రుద్రాభిషేక కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

ఈ సందర్భంగా స్వామి జ్యోతిర్లింగాల ఆయిస్కాంత శక్తిని ప్రజలకు చూపించారు. ఈ జ్యోతిర్లింగాల దర్శనం కోసం తాండూరుకు చెందిన కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి, ఎండీ బుయ్యని సరళా రెడ్డి దంపతులు హాజరయ్యారు. స్వామి సమక్షంలో జ్యోతిర్లింగాలను దర్శించుకున్నారు. అదేవిధంగా మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి, మాజీ చైర్ పర్సన్ సునీతా సంపత్, పలు సంఘాల ప్రతినిధులు, మహిళలు, ప్రముఖులు కూడా జ్యోతిర్లింగాలను దర్శించుకున్నారు.

జ్యోతిర్లింగాల శక్తిని తిలకించిన భక్తులు భక్తిశ్రద్దలతో దర్శించుకుని పాహీమాం అంటూ వేడుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం పెంపొందించేందుకు దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల నర్సింలు, డా.సంపత్ కుమార్, పలువురు రాజకీయ నాయకులు, పట్టణ ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు.

